థగ్ లైఫ్ గ్లింప్స్: సేనాపతి కంటే ఈ థగ్ ఉత్తమం
కమల్ హాసన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు నిర్మాతలు అతడి పాత్రను ఫస్ట్ పర్సన్ లో పరిచయం చేసిన తీరు అదరగొట్టింది
By: Tupaki Desk | 6 Nov 2023 5:42 PM GMTకమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా చూశాక మైండ్ బ్లో అంటూ పొగిడేశారు. విశ్వనటుడికి సరైన క్యారెక్టర్.. సరైన స్టోరి పడితే ఎలా చించి ఆరేస్తాడో 'విక్రమ్' నిరూపించింది. ఆ తర్వాత కెరీర్ మ్యాటర్ లో ఉలగనాయగన్ కి ఎదురే లేదు. ఇప్పటికిప్పుడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో హీట్ పుట్టించేస్తున్నాడు. కమల్ రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు మరో సంచలనాత్మక కాంబినేషన్ తో దడ పుట్టిస్తున్నాడు. కమల్- మణిరత్నం 36 సంవత్సరాల తర్వాత రెండవసారి కలిసి పని చేస్తున్నారన్న వార్త ఇటీవల సంచలనంగా మారింది. ఈ ఇరువురు దిగ్గజాల కలయికలో #KH234 చిత్రం గత నెలలో ప్రారంభమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జయం రవి, దుల్కర్ సల్మాన్, త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించనున్నారు.
కమల్ హాసన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు నిర్మాతలు అతడి పాత్రను ఫస్ట్ పర్సన్ లో పరిచయం చేసిన తీరు అదరగొట్టింది. 'థగ్ లైఫ్' అనే టైటిల్ ఆద్యంతం క్యూరియాసిటీని పెంచింది. టైటిల్ కి తగ్గట్టే అతడు ఒక ఘోరమైన థగ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎదురుగా మృత్యువే వస్తున్నా దానిని పడగొట్టడం ఎలానో తెలిసిన భీకరమైన థగ్ (గజదొంగ)గా కనిపిస్తున్నాడు కమల్. అతడు ఎవరికైనా ఎదురు నిలిచి దృఢంగా ఎదురెళతాడు. అయితే ఒక సమూహం అతడిపై దాడికి దూసుకొస్తున్నా ఎవరినీ లెక్క చేయక తన పరాక్రమాన్ని చూపిస్తాడు. మణి సర్ ఈ విజువల్ ని తెరకెక్కించిన వైనం మతి చెడగొట్టింది. ముఖ్యంగా 300- గ్లాడియేటర్ రేంజులో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. సాంకేతికతలో భారతీయ సినిమా మరో ముందడుగు అని చెప్పేందుకు ఇటీవలి భారీ చిత్రాల విజువల్స్ ప్రూఫ్ గా నిలుస్తున్నాయి.
మణిరత్నం- థగ్ లైఫ్ అత్యుత్తమ సాంకేతికతతో తెరకెక్కించనున్నారనేందుకు ఈ గ్లింప్స్ ఒక ఎగ్జాంపుల్. ఉదయనిధి స్టాలిన్ సమర్పకుడిగా కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం, రవి కె చంద్రన్ డివోపీ వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అన్బరీవ్ స్టంట్స్ ఈ చిత్రానికి ప్రధాన అస్సెట్ కానున్నాయి.
వరుస పాన్ ఇండియాలతో బిజీ బిజీ:
కమల్ హాసన్ తదుపరి కల్కి, KH233, ఇండియన్ 2, థగ్ లైఫ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలతో అభిమానుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలన్నిటిలో వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. నాయకన్‌లో కమల్ హాసన్ పోషించిన ప్రధాన పాత్ర శక్తివేల్ నాయక్ అకా వేలు, మళ్లీ థగ్ లైఫ్‌లో, రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా కనిపిస్తాడు. థగ్ లైఫ్‌పై చాలా థియరీలు ఉన్నా కానీ కమల్ హాసన్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రత్యేకం అవుతుందని భావిస్తున్నారు. ఇది నాయగన్ స్పిన్ ఆఫ్ అని కొందరు అభిప్రాయపడగా, మరికొందరు దీనిని పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా భావిస్తున్నారు.
ఇటీవలే ఇండియన్ 2 టీజర్ విడుదలైనా కానీ మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా టీజర్ ఇంత చప్పగా ఉండడమేంటి? అంటూ విమర్శలొచ్చాయి. కానీ మణిరత్నం మేకింగ్ లో థగ్స్ లైఫ్ టీజర్ కి గూస్ బంప్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ టీజర్ విడుదల కాగానే సోషల్ మీడియా రంగరాయ శక్తివేల్ నాయకర్‌ని ఇండియన్ 2 లోని సేనాపతితో పోల్చడం ప్రారంభించారు. సేనాపతి కంటే సతివేల్ నాయకర్ తమను బాగా ఆకట్టుకున్నారని ప్రశంసిస్తున్నారు.