చెన్నైలో వీధికి లెజెండరీ SP బాలసుబ్రహ్మణ్యం పేరు
ఆయన ఇహలోకం వీడినా అజరామరమైన ఆయన గానామృతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆస్వాధిస్తూనే ఉన్నారు.
By: Tupaki Desk | 26 Sep 2024 7:11 AM GMTదిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించి నాలుగేళ్లు అవుతున్నా, ఆయన ఇంకా మన మధ్యనే జీవించి ఉన్నారు. ఆయన ఆలపించిన వేలాది పాటల రూపంలో ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారు. లెజెండరీ గాయకుడు బాలు నాల్గవ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన ఇల్లు ఉన్న వీధికి ఆయన గౌరవార్థం పేరు పెట్టారు. కరోనావైరస్ కారణంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాల సుబ్రమణ్యం 2020 సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఆయన ఇహలోకం వీడినా అజరామరమైన ఆయన గానామృతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆస్వాధిస్తూనే ఉన్నారు. ఇది ఆయనకు నిరంతర సంస్మరణ. ఆయనను సత్కరిస్తూ హృదయపూర్వక నివాళులు అర్పించేందుకు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంగంబాక్కంలోని కామ్‌దర్ నగర్‌లోని మొదటి వీధికి అధికారికంగా `ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీధి`గా నామకరణం చేశారు.
భారతీయ సంగీత రంగంపైనా చెన్నై నగరంపైనా SPB చూపిన ప్రభావానికి శాశ్వతమైన గుర్తుగా ఈ వీధి ఉంటుంది. గానగంధర్వుడి పేరును అనునిత్యం ప్రజలు సంస్మరించుకునేందుకు ఇది ఒక నివాళి. 4 జూన్ 1946న ఆంధ్రప్రదేశ్‌లోని కోనేటమ్మపేటలో జన్మించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 16 భారతీయ భాషల్లో 40,000 పాటలను ఆలపించారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించారు.
SPB అని ఆయనను ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. 1966లో తెలుగు సినిమా `శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న`తో గాయకుడిగా సినీఆరంగేట్రం చేసారు. భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (2011), పద్మశ్రీ (2001) వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను గానగంధర్వుడు స్వీకరించారు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన 2020 సంవత్సరంలో దివంగతులయ్యారు.