Begin typing your search above and press return to search.

కంగన 'ఎమర్జెన్సీ' థియేట‌ర్ల ఎదుట టెన్ష‌న్ టెన్ష‌న్

ఈ చిత్రం సిక్కు సమాజాన్ని ప్రతికూలంగా ప్రదర్శించినందున దానిని ఎక్కడా చూపించకూడదని సిక్కు ప్ర‌తినిధులు అన్నారు.

By:  Tupaki Desk   |   18 Jan 2025 4:31 AM GMT
కంగన ఎమర్జెన్సీ థియేట‌ర్ల ఎదుట టెన్ష‌న్ టెన్ష‌న్
X

సిక్కు సంఘాల నిరసనల మధ్య కంగనా ఎమర్జెన్సీ ప్రదర్శనను పంజాబ్ లోని ప‌లు న‌గ‌రాల్లో ర‌ద్దు చేసారు. సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి ఇచ్చిన నిరసన పిలుపు మేరకు పంజాబ్ లోని లుథియానా స‌హా న‌గ‌రాల్లో అన్ని సినిమా హాళ్లలో కంగనా రనౌత్ చిత్రం 'ఎమర్జెన్సీ'ని ర‌ద్దు చేసారు. సిక్కు సంస్థల ప్రతినిధులు థియేట‌ర్ల బయట పెద్ద ఎత్తున గుమిగూడటంతో అల్ల‌ర్లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

సిక్కు సంస్థల ప్రతినిధులు థియేటర్ల వెలుపల గుమిగూడి సినిమాకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ చిత్రం సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని దేశవ్యాప్తంగా నిషేధించాలని గురుద్వారా క‌మిటీ అధ్యక్షుడు ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేసారు. పంజాబ్ లుథియానాలోని ఫౌంటెన్ చౌక్ సమీపంలోని పెవిలియన్ మాల్ వెలుపల, ఫిరోజ్‌పూర్ రోడ్డులోని సిల్వర్ ఆర్క్ మాల్ స‌హా మరికొన్ని మల్టీప్లెక్స్‌ల వెలుపల నిరసనలు జరిగాయి.

చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిక్కు గ్రూపులు ఇచ్చిన పిలుపు గురించి పోలీసు అధికారులకు ముందే తెలుసు కాబట్టి వారు రోజంతా హై అలర్ట్‌లో ఉన్నారు. నిరసన కారణంగా పెవిలియన్ మాల్ యాజమాన్యం మాల్ వెలుపల ఒక నోటీసును ఏర్పాటు చేసి, సినిమా ప్రదర్శన రద్దు చేస్తున్నామ‌ని ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేసారు.

ఏదైనా థియేటర్‌లో సినిమాను ప్రదర్శిస్తే తాము బలమైన ఆందోళనను ప్రారంభిస్తామని థియేట‌ర్ల ఎదుటే ఆందోళనకారులు తెలిపారు. నిరసనకారులలో ఒకరైన నరీందర్ సింగ్ మాట్లాడుతూ..ఈ చిత్రాన్ని ప్రదర్శించవద్దని, శాంతిని కాపాడాలని సినిమా హాళ్ల యజమానులకు మేము విజ్ఞప్తి చేసామని తెలిపారు. బిజెపి ఎంపీ కంగనా రనౌత్ ఈ చిత్రం ద్వారా సిక్కు సమాజాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు. ఈ చిత్రంలో సిక్కుల పాత్రను తప్పుగా చిత్రీకరించారు అని సింగ్ అన్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా తాము ఇప్పటికే మాట్లాడామని, ఆ తర్వాత సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలను కూడా తొలగించిందని, కానీ కంగనా రనౌత్ రైతుల ఉద్యమాన్ని త‌ప్పుగా చూపింద‌ని, ఈ కారణంగా పంజాబ్‌లో తన సినిమా ప్రదర్శనను అనుమతించబోమని నిరసనకారులు తెలిపారు.

ఈ చిత్రం సిక్కు సమాజాన్ని ప్రతికూలంగా ప్రదర్శించినందున దానిని ఎక్కడా చూపించకూడదని సిక్కు ప్ర‌తినిధులు అన్నారు. ఈ చిత్రం వాస్తవాలను పూర్తిగా వక్రీకరించిందని అన్నారు. అయితే సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు ర‌ద్దు కావ‌డంతో కొన్ని మాల్స్ తిరిగి టికెట్ డ‌బ్బును వాప‌సు ఇస్తున్నాయి. అయితే ఎమ‌ర్జెన్సీ సినిమాపై కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ''ఇందిర అంటే కంగ‌న‌, కంగ‌న అంటే ఇందిర‌!'' అనేంత‌గా ఆ పాత్ర‌లో కంగ‌న జీవించింద‌ని ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. క‌నీసం ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యే వరకు వేచి ఉంటామ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.