Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు కంగ‌న ఎమ‌ర్జెన్సీకి సెన్సార్ పూర్తి

సెప్టెంబర్ ప్రారంభంలో నిర్మాణ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేసేలా CBFCని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 4:32 PM GMT
ఎట్ట‌కేల‌కు కంగ‌న ఎమ‌ర్జెన్సీకి సెన్సార్ పూర్తి
X

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' చాలా కాలంగా విడుద‌ల‌కు నోచుకోలేదు. సెన్సార్ గ‌డ‌పై ఇబ్బందులే దీనికి కార‌ణం. శిక్కు సంఘాలు రాజ‌కీయ ఎజెండాతో త‌న సినిమాని అడ్డుకున్నాయ‌ని కంగ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎట్ట‌కేల‌కు కొన్ని క‌ట్స్ కి కంగ‌న అంగీక‌రించ‌డంతో ఈ సినిమాకి సెన్సార్ పూర్త‌యింది. వివాదాస్పద చిత్రానికి CBFC సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడంతో ఇప్ప‌టికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో న‌టి కం బిజెపి ఎంపి కంగ‌న‌ ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. స‌ర్టిఫికెట్ అందుకున్న త‌ర్వాత కంగ‌న ఇలా వ్యాఖ్యానించారు. ''మా సినిమా 'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము. మీ సహనం, మద్దతుకు ధన్యవాదాలు'' అని కంగన తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో రాసింది.

జీ- ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి క్వీన్ కంగ‌న సహనిర్మాతగా రూపొందించిన ఈ పొలిటికల్ డ్రామా ప‌లుమార్లు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద సర్టిఫికేట్ చిక్కుకుపోవడంతో విడుద‌ల‌ సాధ్యం కాలేదు. శిరోమణి అకాలీదళ్‌ సహా సిక్కు సంస్థలు త‌మ సమాజాన్ని తప్పుగా చిత్రీకరించార‌ని, వాస్తవాలను వ‌క్రీక‌రించార‌ని ఆరోపించడంతో 'ఎమర్జెన్సీ' వివాదంలో చిక్కుకుంది. తనకు, సిబిఎఫ్‌సి సభ్యులకు బెదిరింపులు వచ్చాయని, మాజీ ప్రధానిని తన సెక్యూరిటీ గార్డులు హత్య చేసినట్లు చూపవద్దని ప‌రోక్షంగా ఒత్తిడి తెచ్చార‌ని కంగ‌న ఆరోపించారు. బెదిరింపుల వ‌ల్ల‌నే ఫిల్మ్ బాడీ సర్టిఫికేషన్‌ను నిలిపివేసిందని ఆరోపించింది. ఇది త‌న‌ను తీవ్రంగా నిరాశపరిచింద‌ని కంగ‌న ఆవేద‌న చెందారు.

సెప్టెంబర్ ప్రారంభంలో నిర్మాణ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేసేలా CBFCని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సినిమాలో బోర్డు సూచించిన కోతలకు కంగ‌న రనౌత్ అంగీకరించారని హైకోర్టుకు తెలిపింది. సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా ఎమర్జెన్సీ విడుదల వాయిదా పడడంతో ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కూడా కంగ‌న‌ రనౌత్ చెప్పారు. థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాపై నా వ్యక్తిగత ఆస్తిని పణంగా పెట్టాను. ఇప్పుడు విడుదల చేయడం లేదు కాబట్టి కష్టకాలంలో అమ్మేయడానికి ఆస్తిని సిద్ధం చేసాన‌ని తెలిపారు.

' 1975 నుండి 1977 వరకు 21 నెలల పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన 'ఎమర్జెన్సీ' కాలంపై సినిమా ఇది. నాటి పరిణామాలను తెర‌పై ఆవిష్క‌రించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు.