శత్రువులతో శాంతి ఒప్పందం.. కాంట్రవర్శీ క్వీన్ కొత్త స్ట్రాటజీ..
ఈ సినిమాలో కంగన అద్భుతంగా నటించింది అంటూ ప్రశంసలు అందుకుంటున్నా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు దక్కలేదు ఎందుకనో..!
By: Tupaki Desk | 20 Jan 2025 1:49 PM GMTదెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఎవరైనా దిగి వస్తారు! విడుదలైన సినిమాలన్నీ ఘోర పరాజయాలుగా మారుతుంటే క్వీన్ కంగనలో మార్పు స్పష్ఠంగా కనిపిస్తోంది. తన వివాదాస్పద వైఖరికి భిన్నంగా ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టే కనిపిస్తోంది. క్వీన్ కంగన నటించిన చాలా సినిమాలు ఏళ్లుగా నిరాశపరుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో స్వయంగా నటించి, స్వీయదర్శకత్వంలో అప్పులు చేసి నిర్మాతగా తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ` కూడా ఫ్లాప్ బాట పడుతోంది. ఈ సినిమాలో కంగన అద్భుతంగా నటించింది అంటూ ప్రశంసలు అందుకుంటున్నా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు దక్కలేదు ఎందుకనో..!
దీనికి తోడు పంజాబ్‌లో తన సినిమాని నిషేధించారు. లండన్ లోను థియేటర్ల ముందు ఖలీస్తానీల గడబిడ నెలకొనడంతో షోలు నిలిపివేసారు. ఈ పరిస్థితులు చూస్తుంటే .. కంగనపై పరిశ్రమ వ్యక్తులతో పాటు, ప్రజల్లో ఎంతగా వ్యతిరేకత నెలకొందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ రైతులను వ్యతిరేకిస్తూ.. భాజపా అనుకూల ప్రకటనలు చేసాక ఆ రాష్ట్రానికి కంగన వ్యతిరేకిగా మారింది. పంజాబీ మూలాలున్న ప్రతిచోటా ఇప్పుడు కంగన శత్రువు. దాని ఫలితం ఇప్పుడు సొంత పెట్టుబడులతో నిర్మించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ చిక్కుల్ని ఎదుర్కొంది. పైగా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కాలంతో ముడిపడి ఉన్న శిక్కులను కించపరిచే, లేదా వారిని అవమానించే విధంగా ఈ సినిమా ఉందంటూ కంగన ఎదురు దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కంగన సినిమాని పరిపూర్ణంగా నిషేధించడంలో శిక్కులు పెద్ద సక్సెసయ్యారు. దీనివల్ల కంగనను నమ్మిన బయ్యర్లకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో క్వీన్ కంగన తన బద్ధ శత్రువులు అయిన కరణ్ జోహార్, దిల్జీత్ దోసాంజ్ వంటి వారితో స్నేహం కోరుతూ శాంతి సందేశంతో కూడుకున్న స్నేహహస్తాన్ని అందించాలని చూడటం అందరి దృష్టిని ఆకర్షించింది. కరణ్ జోహార్ , దిల్జిత్ దోసాంజ్‌లతో కంగనా రనౌత్ సంబంధాలు నీటి మూట లాంటివి. బాలీవుడ్ మాఫియా, పక్షపాతి అంటూ కరణ్ ని తీవ్రంగా విమర్శించిన కంగన, కేంద్రంపైనా భాజపా వ్యవహారంపైనా పంజాబ్ రైతుల నిరసనల సమయంలో గాయకుడు కం నటుడు దిల్జీత్ తోను వైరం పెట్టుకుంది. ఇప్పుడు ఆ ఇద్దరితో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటానని కంగన వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ ఒక ట్విస్టు కూడా ఉంది. నేను వారితో శాంతంగా ఉంటాను కానీ వారిని స్నేహితులుగా చేసుకోవాల్సిన అవసరం లేదు! అని వ్యాఖ్యానించింది. వాళ్లతో కలిసి పని చేస్తాను కానీ, వ్యక్తిగత స్నేహాలు అవసరం లేదని స్పష్టంగా చెప్పింది. చివర్లో ఈ ట్విస్టు ఏంటి కాంట్రవర్శీ క్వీన్? అంటూ కంగనను కొందరు ప్రశ్నిస్తున్నారు.