Begin typing your search above and press return to search.

ఆమె వదిలేసిన మూడు సూపర్‌ హిట్స్‌

సెప్టెంబర్‌ 6న విడుదల అవ్వబోతున్న ఎమర్జెర్సీ సినిమా ప్రమోషన్‌ లో కంగనా పాల్గొంటుంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 10:30 AM GMT
ఆమె వదిలేసిన మూడు సూపర్‌ హిట్స్‌
X

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెల్సిందే. ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా ఆమె నుంచి వరుసగా సినిమాలు వస్తాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్‌ 6న విడుదల అవ్వబోతున్న ఎమర్జెర్సీ సినిమా ప్రమోషన్‌ లో కంగనా పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ వివాదం రాజుకుంటూ, సినిమా విడుదల అడ్డుకోవాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది.

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకురాలు దివంగత ఇందిరా గాంధీ కి సంబంధించిన కథ తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ రోజుల్లో దేశంలో నెలకొన్న పరిస్థితులను గురించి కంగనా తన ఎమర్జెన్సీ సినిమాలో చూపించబోతుందట. కంగనా స్వీయ దర్శకత్వంలో ఇందిరా గాంధీ పాత్ర లో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కంగనా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను చాలా సినిమాలను పాత్రలు నచ్చక, ఇతర కారణాల వల్ల వదులుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

రణబీర్ కపూర్‌ నటించిన సంజు సినిమాలో నటించమని సంప్రదించారు. కానీ ఆ సినిమాలోని పాత్ర నచ్చక పోవడంతో నో చెప్పాను అంది. రణబీర్‌ కపూర్‌ తో కలిసి నటించేందుకు కంగనా ఆసక్తి చూపించలేదు అంటూ గతంలో కూడా ఈ విషయమై మీడియాలో ప్రచారం జరిగింది. ఇక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన రామ్‌ లీలా లో కూడా కంగనా రనౌత్‌ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయట. ఆ సినిమాను కూడా తాను తిరస్కరించినట్లు కంగనా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కంగనా నో చెప్పిన రామ్‌ లీలా సినిమా లో హీరోయిన్‌ గా దీపికా పదుకునే నటించింది.

అక్షయ్‌ కుమార్‌ నటించిన హిట్‌ చిత్రాల్లో ఒకటి సింగ్ ఈజ్ బ్లింగ్‌. ఈ సినిమాలో కూడా కంగనా ను హీరోయిన్‌ గా నటింపజేసేందుకు చర్చలు జరిగాయట. కానీ కంగనా మాత్రం సున్నితంగా ఆ సినిమాను కూడా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. ఆయా సినిమాల్లోని పాత్రలు నచ్చకనే పెద్ద ఆఫర్లు అయినా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. ఇంకా చాలా సినిమాలు కంగనా వరకు వెళ్లి తిరస్కరణకు గురి అయ్యాయి. అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆమె స్థానంలో తీసుకున్న హీరోయిన్స్ కి మంచి స్పందన దక్కింది. ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలకు ఆమె ను ఫిల్మ్‌ మేకర్స్ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆమె ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు, స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్స్ కారణంగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న కంగనా కి ఎమర్జెన్సీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.