కరణ్ జోహార్‌పై కంగన మరో దాడి
కంగనా తన సినిమా ఎమర్జెన్సీ ప్రచార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరణ్ జోహార్ తో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 10 Jan 2025 12:30 PM GMTక్వీన్ కంగన రనౌత్ - అగ్ర నిర్మాత కరణ్ జోహార్ మధ్య శత్రుత్వం గురించి తెలిసిందే. కరణ్ పై కంగన పదే పదే మాటల దాడి చేసింది. అతడిపై వ్యంగ్యంగా చలోక్తులు విసింది. ఇప్పుడు అందుకు భిన్నంగా కాస్త స్వరం మార్చింది. కానీ చివరికి ఇది కూడా మరో బిగ్ పంచ్ అని తేలింది
కంగనా తన సినిమా ఎమర్జెన్సీ ప్రచార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరణ్ జోహార్ తో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేసింది. 'ఇండియన్ ఐడల్' అనే సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొన్న కంగన కెజోవోను 'సర్' అని పిలవడమే గాక అతడికి మెగా ఆఫర్ ఇచ్చింది. ''నాకు చెప్పడానికి బాధగా ఉంది. కానీ కరణ్ సర్ నాతో ఒక సినిమా చేయాలి. నేను అతడికి చాలా మంచి పాత్ర ఇస్తాను. చాలా మంచి సినిమా చేస్తాను.. అది అత్తగారు - కోడలు గొడవల గురించి కాదు.. కేవలం ప్రజా సంబంధాల కసరత్తు కాదు. ఇది సరైన సినిమా అవుతుంది. అతడికి సరైన పాత్ర లభిస్తుంది'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
నిజానికి కంగన అతడిపై చలోక్తులు విసరడం, విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2017లో 'కాఫీ విత్ కరణ్' షోలో కనిపించింది. అతడిని సినిమా మాఫియా అంటూ విమర్శించింది. ఆ తర్వాత పలుమార్లు కరణ్ నిర్మించిన సినిమాలను కంగన తీవ్రంగా విమర్శించింది. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ'పై విమర్శలు గుప్పిస్తూ.. కరణ్ జోహార్ ఒకే సినిమాను తొమ్మిది సార్లు తీసినందుకు సిగ్గుచేటు... మిమ్మల్ని మీరు భారతీయ సినిమా పతాకధారిగా పిలుచుకుంటూ ఎప్పుడు కిందికి వెళుతున్నారు... నిధులను వృధా చేయకండి.. అని వ్యాఖ్యానించింది.
అలాగే ప్రియాంక చోప్రాను దేశం వదిలి వెళ్లేలా వేధించాడని కూడా కరణ్ జోహార్ పై తీవ్ర విమర్శల దాడి చేసింది కంగన. అనుష్క శర్మ విషయంలోను కరణ్ కలుషిత ఆలోచనను బహిర్గతం చేస్తూ... అతడిపై చెడామడా చెలరేగింది. వీలున్న అన్ని సందర్భాల్లో కరణ్ పై కంగన ఎదురు దాడికి దిగింది.
నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: కంగన
కంగనా రనౌత్ తన మొదటి సోలో దర్శకత్వ వెంచర్ 'ఎమర్జెన్సీ'ని వెంటాడుతున్న వివాదాల గురించి వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో తన తప్పుల గురించి ఒప్పుకుంది. ఎమర్జెన్సీకి తానే స్వయంగా దర్శకత్వం వహించడం .. నేరుగా స్ట్రీమింగ్‌కు వెళ్లకుండా థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం తన తప్పిదం అని అంగీకరించింది. సినిమా నిర్మాణ సమయంలో తాను అనేక ఇతర తప్పుడు ఎంపికలు చేశానని కంగన అంది. ఎమర్జెన్సీ టైటిల్ తో వివాదాస్పద నాయకురాలు ఇందిరమ్మ జీవితకథను తెరకెక్కించినందున ప్రత్యర్థులైన సిక్కులు ఈ సినిమాని రిలీజ్ కానీకుండా అడ్డుకున్నారు. ఇందిరమ్మ గురించి సినిమా తీసింది కాబట్టి భాజపా కూడా తనకు సహకరించలేదు. రిలీజ్ ముందు సెన్సార్ చిక్కులు వచ్చి పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిమచల్ ప్రదశ్ మండి ఎంపీగా ఉన్న కంగన రనౌత్ ఒక నాయకురాలిగాను చాలా ఎదురు దాడులను ఎదుర్కొంటోంది.