ఇందిరమ్మ సినిమా చూడటానికి ప్రియాంక గాంధీకి ఆహ్వానం
భారతదేశపు మొట్ట మొదటి మహిళా ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జీవితకథతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jan 2025 7:52 AM GMTభారతదేశపు మొట్ట మొదటి మహిళా ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జీవితకథతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. `ఎమర్జెన్సీ` అనేది టైటిల్. క్వీన్ కంగన రనౌత్ స్వయంగా ఇందిరమ్మ పాత్రలో నటించి స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ట్రైలర్ ఇంతకుముందే రిలీజై ప్రశంసలు అందుకుంది. ఇందిర పాత్రలో కంగన ఒదిగిపోయిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుని ఎట్టకేలకు ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తయింది. జనవరి 17న సినిమా విడుదల కానుంది.
తన చిత్రం `ఎమర్జెన్సీ`ని వీక్షించేందుకు రాజకీయ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాకు ఆహ్వానం పంపినట్లు కంగన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. కంగన ఐఏఎన్ఎస్ తో మాట్లాడుతూ-``నేను పార్లమెంటులో ప్రియాంక గాంధీని కలిశాను. మీరు ఎమర్జెన్సీ సినిమా చూడాలి`` అని చెప్పాను. ప్రియాంక గాంధీ చాలా దయతో ఉన్నారు! సినిమా చూస్తానని నాతో అన్నారని కంగన తెలిపారు.
ఎమర్జెన్సీ- ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన చాలా సున్నితమైన సునిశితమైన చిత్రణ అని నేను భావిస్తున్నాను. శ్రీమతి ఇందిరా గాంధీని తెరపై చాలా గౌరవంగా చిత్రీకరించాను. ఎందుకంటే నేను చాలా పరిశోధించే క్రమంలో ఇందిర వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు తెలిసాయి. తన భర్తతో, అలాగే చాలా మంది స్నేహితులతో లేదా వివాదాస్పద అంశాలతో సంబంధం కలిగి ఉన్నారు. మగవారితో పోలిస్తే మహిళలను తగ్గించి చూస్తారు. అయితే ఇందిర జీవితంలో సంచలనాత్మక ఎన్ కౌంటర్లు ఉన్నాయి. నేను ఆమె పాత్రను చాలా గౌరవంగా , సున్నితత్వంతో చిత్రీకరించాను. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని నేను భావిస్తున్నాను`` అని అన్నారు. నాయకురాలిగా తాను ఇందిరాగాంధీని ఇష్టపడతానని కంగన అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కొన్ని అసాధారణ విషయాలను మాత్రమే కాకుండా.. ఇందిర ప్రేమించే చాలా విషయాలను తెరపై చూపాను. దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రి కావడం ఒక జోక్ కాదు. ఇందిరను ప్రజలు ప్రేమించారు.. అని కంగన అన్నారు.
సెన్సార్ కట్స్‌తో నష్టం లేదు:
కంగనా రనౌత్ తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ బోర్డు విధించిన కట్స్‌పై ఓపెన్ అయ్యింది. ఈ చిత్రం పూర్తి వెర్షన్ చూడాలనుకున్నానని, అయితే కట్‌లు కూడా సినిమా కథను ప్రభావితం చేయలేదని చెప్పింది. నిజానికి
ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది కానీ CBFC (సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుండి సర్టిఫికేషన్‌లో సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు యుఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు సినిమాకు 13 కట్స్ తో సెన్సార్ ఆమోదించింది. సెన్సార్ పూర్తి చేసుకుని సినిమా ఇప్పుడు జనవరి 17 న విడుదల కానుంది.
ఫుల్ వెర్షన్ వస్తే బాగుండేది.. కానీ కట్స్‌తో ఎలాంటి ఇష్యూ లేదు.. ఎందుకంటే సినిమా ఎవరినో వెక్కిరించేలా తీయలేదని కూడా కంగన అన్నారు. కొన్ని ఎపిసోడ్లు పూర్తిగా తీసేసారు. ఇది నా సినిమాపై ప్రభావం చూపదని కూడా అన్నారు. కథ చెక్కుచెదరలేదు.. సందేశం కూడా చెక్కు చెదరలేదని కంగన వెల్లడించింది. 1970లలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ఘటనలపై తెరకెక్కిన సినిమా ఇది.