మళ్లీ చిక్కుల్లో కంగన 'ఎమర్జెన్సీ'
స్వతంత్ర భారతదేశ చీకటి అధ్యాయంగా చెప్పుకునే 1975 -1977 మధ్య మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ కాలంపై తెరకెక్కిన చిత్రమిది.
By: Tupaki Desk | 17 Jan 2025 8:30 AM GMTక్వీన్ కంగన రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' రాజకీయ ప్రాధాన్యం కారణంగా, రిలీజ్ ముందు చాలా కష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేషన్ రకరకాల కారణాలతో జాప్యం కాగా పలుమార్లు రిలీజ్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. సిక్కు వ్యతిరేక ఉద్యమాలతోను సమస్యల్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు(17జనవరి) విడుదలైంది. కానీ పంజాబ్‌లో ఈ సినిమాని నిషేధించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) పిలుపునిచ్చింది. సిక్కుల వ్యతిరేక చిత్రం 'ఎమర్జెన్సీ'ని పంజాబ్‌లో నిషేధించాలని ఎస్.జి.పి.సి డిమాండ్ చేసింది. గురువారం, అంటే సినిమా విడుదలకు ఒక రోజు ముందు SGPC అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఒక లేఖ రాసి, ఆ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయకూడదని వాదించారు. కంగనా తన సినిమాలో సిక్కులను కించపరిచారని ఆయన ఆరోపించారు.
ఎస్.జి.పి.సి ఇప్పటికే తన కార్యనిర్వాహక కమిటీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపింది. దీనిలో ఈ సినిమాను పంజాబ్‌లో ప్రదర్శించడానికి అనుమతి లేదని స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఇది సిక్కులను కించపరిచే పథకం కింద నిర్మించిన సినిమా అని లేఖలో ఆరోపించారు. కమిటీ తీర్మానం జరిగినా కానీ విచారకరంగా, మీ (భగవంత్ మాన్) నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించింది. ఈ సినిమా జనవరి 17న విడుదలైతే, అది సిక్కు ప్రపంచాన్ని ఆగ్రహానికి గురి చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం, ఇతర గురుద్వారాలపై దాడులు, సిక్కుల మారణహోమం (1984)కు సంబంధించిన వాస్తవాలను దాచడం ద్వారా ఈ సినిమా సిక్కు వ్యతిరేక ఎజెండా కింద విషాన్ని వ్యాప్తి చేయడానికి పనిచేస్తుందని శిక్కు సమాజం ఆరోపించింది. కాబట్టి ఈ సినిమాను పంజాబ్‌లో ప్రదర్శించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. విడుదకు ముందు కూడా మేం దీనిని డిమాండ్ చేసామని ఎస్‌జిపిసి ప్రతినిధులు అన్నారు. కంగనా రనౌత్ ఎమర్జెన్సీపై గురుద్వారా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా, ఈ సినిమాపై పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీని ఫలితంగా విడుదల ఆలస్యం అయింది.
స్వతంత్ర భారతదేశ చీకటి అధ్యాయంగా చెప్పుకునే 1975 -1977 మధ్య మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ కాలంపై తెరకెక్కిన చిత్రమిది. కంగన స్వయగా నటించి స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరి, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షాగా మిలింద్ సోమన్ నటించారు. 17 జనవరి 2025న థియేటర్లలోకి విడుదలైంది. ఇప్పటికే ఎమర్జెన్సీపై సమీక్షలు వచ్చాయి.