ఖాన్‌ల త్రయాన్ని డైరెక్ట్ చేస్తానన్న కంగన
బాలీవుడ్‌లో తన ఫేవరెట్ ఖాన్ ఎవరో కంగనా వెల్లడించింది. నాకు ఇష్టమైన ఖాన్‌లలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు అని కూడా ఈ సందర్భంగా తెలిపింది.
By: Tupaki Desk | 15 Aug 2024 11:30 AM GMTక్వీన్ కంగన గట్సీ డెసిషన్స్, ఎటాకింగ్ స్టైల్ కి ఫ్యాన్సున్నారు. తాను ఏం మాట్లాడినా కొట్టినట్టే ఉంటుందని ఫీలయ్యేవాళ్లున్నారు. అది క్వీన్ స్టైల్. కంగన ఇమేజ్ పెంచిన యాటిట్యూడ్ ఇది. ఈరోజు హిమచల్ ప్రదేశ్ 'మండి' నుంచి భాజపా ఎంపీగా కొనసాగుతోంది అంటే దానికి కారణం ఈ గట్సీ యాటిట్యూడ్.
ఇటీవల మణికర్ణికలో కొంత భాగం షూటింగ్ కోసం కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కంగన ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాకి దర్శకత్వం వహించారు. కంగన నటించి, స్వయంగా డైరెక్ట్ చేసిన ఎమర్జెన్సీ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కంగన స్వర్గీయ ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. తాజాగా ట్రైలర్ లాంచ్ వేడుకలో క్వీన్ కంగన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. కంగన బాలీవుడ్‌లోని ముగ్గురు ప్రముఖ ఖాన్‌లు - షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల విషయంలో తన నిజాయితీని ప్రస్థావించారు.
తాను ముగ్గురు ఖాన్‌లతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు కంగన వెల్లడించింది. ముగ్గురు ఖాన్‌లతో కలిసి ఒక చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిభావంతులైన వారు నటించడంతోపాటు అందంగా కనిపించడం కూడా నాకు చాలా ఇష్టం. వారు కలిసి ఏదైనా చేయగలరు. సమాజానికి ఇలాంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారంతా చాలా ప్రతిభావంతులు.. అని కంగన వ్యాఖ్యానించింది.
బాలీవుడ్‌లో తన ఫేవరెట్ ఖాన్ ఎవరో కంగనా వెల్లడించింది. నాకు ఇష్టమైన ఖాన్‌లలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు అని కూడా ఈ సందర్భంగా తెలిపింది. షారూఖ్ - అమీర్ - సల్మాన్ సినిమా పరిశ్రమకు చాలా ఆదాయాన్ని జోడిస్తున్నారు. వారికి మనం ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. అలాగే వారు చాలా మంది వ్యక్తులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ రకమైన కలయిక కళాత్మకంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇది కేవలం కొన్ని చిత్రాలతో కొందరికే పరిమితం కాకూడదు. వారిని డైరెక్ట్ చేసే అవకాశం చాలా మంది ప్రతిభావంతులకు రాలేదు. దీనికి నేను ఎల్లప్పుడూ చింతిస్తున్నాను.. అని అన్నారు. క్యాన్సర్ తో మరణించిన ప్రతిభావంతుడైన ఇర్ఫాన్ తో కలిసి పని చేయలేకపోయినందుకు తన బాధను వ్యక్తం చేసారు కంగన. తనను పరిశ్రమ బహిష్కరించిందని, తనతో నిలబడటం లేదా కలిసి పనిచేయడం ఎవరికీ అంత సులభం కాదని కంగన అన్నారు. తనను ప్రశంసించడం అంత సులభం కాదని కంగన పేర్కొంది.
కంగన తదుపరి చిత్రం- ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, దివంగత సతీష్ కౌశిక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాలం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో యువతి అయిన ఇందిర రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలో తన తండ్రి, దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ఉన్న బంధాన్ని ఆవిష్కరించారు. ఆమె తన కెరీర్‌లో విభేదాలు, రాజకీయ గందరగోళం, ఇతర సమస్యలను ఎలా డీల్ చేసిందో ట్రైలర్ ఆవిష్కరించింది. ఎమర్జెన్సీ 6 సెప్టెంబర్ 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.