డిగ్రీ తర్వాత మిలటరీ శిక్షణ తప్పనిసరి చేయాలి: కంగన
భారతదేశంలోని ప్రతి ఒక్కరూ డిగ్రీలు పూర్తి చేసాక మిలటరీలో చేరి శిక్షణ పొందడాన్ని తప్పనిసరి చేయాలని క్వీన్ కంగన అన్నారు
By: Tupaki Desk | 12 Oct 2023 5:29 AM GMTభారతదేశంలోని ప్రతి ఒక్కరూ డిగ్రీలు పూర్తి చేసాక మిలటరీలో చేరి శిక్షణ పొందడాన్ని తప్పనిసరి చేయాలని క్వీన్ కంగన అన్నారు. దీనివల్ల సోమరితనం బాధ్యతారాహిత్యం అంతరిస్తాయని అన్నారు. క్వీన్ నటించిన తేజస్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కంగన ఫైటర్ పైలట్‌గా నటించింది. తన పాత్ర కోసం జీవితంలోని సవాళ్లను పరిశోధించడంలో అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శించింది. లెఫ్టినెంట్ శివాంగి సింగ్‌తో చర్చా గోష్టిలో కంగనా మన దేశ సరిహద్దులను కాపాడుతున్న ధైర్యవంతుల పట్ల తనకున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని అచంచల గౌరవంతో కూడుకున్న అభిమానాన్ని వెల్లడించింది.
కంగన మాట్లాడుతూ-''సరిహద్దుల్లో స్థిరపడిన ఒక సైనికుడి భావోద్వేగ ప్రయాణాన్ని ఆవిష్కరించే సినిమా 'తేజస్'. ఇది ఒక భారతీయ సైనికుడి మనోభావాలను, వారి నైతికతపై చర్చల ప్రభావాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది. సైనికుడి సాహసాలను తెరపై చూస్తారు'' అని తెలిపారు. 'తేజస్' ట్రైలర్ ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. యూరి నిర్మాతలు మరోసారి తమ బ్రాండ్ సినిమాని తెరకెక్కించారని నమ్మకాన్ని కలిగించింది. కంగన ఈ చిత్రంలో ఛాలెంజింగ్ పాత్రలో నటించారు. ట్రైలర్‌కు విశేషమైన వ్యూస్ రావడంతో పాటు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆర్‌ఎస్‌విపి నిర్మించిన తేజస్‌లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించగా, సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. సర్వేష్ ఈ చిత్రానికి రచయిత. రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ చిత్రం 2023 అక్టోబర్ 27న థియేటర్లలోకి రానుంది.
కంగన నటించిన పీరియడ్ డ్రామా 'ఎమర్జెన్సీ' త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. దీనిలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్ తో కంగన సోలో డైరెక్టర్‌గాను సత్తా చాటనుంది. ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, విశాక్ నాయర్, శ్రేయాస్ తల్పాడే తదితరులు నటించారు.
మూడేళ్లుగా తేజస్ ప్రయాణం
తేజస్ మూడేళ్లుగా చిత్రీకరణ దశలో ఉంది. ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. యూరి లాంటి బ్లాక్ బస్టర్ బార్డర్ యాక్షన్ మూవీని అందించిన మేకర్స్ నుంచి వస్తున్న చిత్రంగా తేజస్ పై అంచనాలున్నాయి. బార్డర్ లో భారీ యాక్షన్‌తో విధ్వంశకర వైమానిక విన్యాసాలతో సినిమా గగుర్పాటుకు గురి చేస్తుందని ట్రైలర్ తో స్పష్ఠత వచ్చింది. ఇందులో మునుపెన్నడూ చూడని గొప్ప అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు అందించనుంది. ఇందులో దేశం కోసం పోరాడే వైమానిక దళ కమాండర్ గా కంగన నటించింది. ఈ సినిమా బయోపిక్ కాదని నిర్మాతలు గతంలోనే ధృవీకరించారు. ఈ చిత్రం అక్టోబర్ లో టైగర్ ష్రాఫ్ 'గణపత్'తో ఢీ కొడుతుందని ప్రచారం సాగినా అలాంటిదేమీ లేదని తేలింది. మూడేళ్లుగా తేజస్ చిత్రీకరణ సాగుతోంది. వీఎఫ్ ఎక్స్ కోసం టీమ్ ఎక్కువ సమయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 2020లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ 2020లో సినిమా విడుదల తేదీని కంగన ప్రకటించింది.