ఆలియాకు గొయ్యి తవ్వడం ఆపేసిన కంగన
సోషల్ మీడియాల్లో కంగన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. #nationalawards2023 విజేతలందరికీ అభినందనలు.
By: Tupaki Desk | 25 Aug 2023 5:16 PM GMTసంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'గంగూబాయి కతియావాడి' చిత్రానికి అలియా భట్ ఉత్తమ నటిగా తన మొదటి జాతీయ అవార్డును గెలుచుకుంది. అవార్డులు ప్రకటించిన వెంటనే ఆలియా ప్రత్యర్థి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. నిజానికి గంగూభాయితో ఉత్తమ నటి విభాగంలో కంగన తలైవి కూడా పోటీపడింది. కానీ ఆ సినిమాకి ఎలాంటి అవార్డు దక్కలేదు. అయితే తనకు అవార్డ్ దక్కనందుకు నిరశపడిన కంగన ఆవేశంలో ఆలియాకు గొయ్యి తవ్వుతుందనే భావించారంతా. ప్రతిసారీ అయినదానికి కానిదానికి నిర్మాత మహేష్ భట్ వారసురాలిని రింగ్ లోకి లాగే కంగన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల వేళ ఏదో ఒక విధంగా తూలనాడుతుందని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా కంగన స్పందించింది. ఒక రకంగా పరోక్షంగా ఆలియాకు శుభాకాంక్షలు తెలిపింది.
సోషల్ మీడియాల్లో కంగన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. #nationalawards2023 విజేతలందరికీ అభినందనలు. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఆర్ట్ కార్నివాల్ ఇది. అన్ని భాషలలో పనితనాన్ని తెలుసుకోవడం.. వారిని పరిచయం చేసుకోవడం నిజంగా అద్భుతం'' అని కంగన వ్యాఖ్యానించింది. తన విషెస్ లో ఏ ఒక్కరినో ప్రత్యేకించి విడిగా పొగడలేదు కంగన.
తాను నటించిన 'తలైవి' చిత్రం ఎలాంటి అవార్డులు గెలుచుకోకపోవడంతో నిరాశకు గురైన కంగన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ''నా చిత్రం తలైవి ఏ అవార్డును గెలవలేదని నిరుత్సాహపడిన మీరంతా... కృష్ణుడు నాకు ఇచ్చిన లేదా ఇవ్వని వాటికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని దయచేసి తెలుసుకోండి.
నన్ను నిజంగా ప్రేమించే అభినందించే మీరంతా నా దృక్పథాన్ని తప్పక అభినందించాలి. అలాగే ....కళ అనేది ఆత్మాశ్రయమైనది. జ్యూరీ తమ వంతు కృషి చేసిందని నేను నిజంగా నమ్ముతున్నాను...అందరికీ నా తరపున శుభాకాంక్షలు... హరే కృష్ణ'' అని క్వీన్ రాశారు.
ఈసారి అలియా- కృతి సనన్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి బిరుదును షేర్ చేసుకున్నారు. గంగూభాయిగా ఆలియా నటప్రదర్శనకు, మిమీలో కృతి నటప్రదర్శనకు దక్కిన అద్భుత పురస్కారమిది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ఆ ఇద్దరికీ గొప్ప గుర్తింపు దక్కింది. ఇకపోతే కంగనా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' చిత్రీకరణతో బిజీగా ఉండగా, ఆలియా తదుపరి 'బ్రహ్మాస్త్ర 2'లో తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి నటించనుంది.