రోటీలో ఉమ్మి వేస్తే కంగన - సోనూసూద్ కొట్లాట?
ఒక హోటల్ వంటవాడు తన కస్టమర్ల కోసం రెడీ చేస్తున్న రోటీల పిండిపై ఉమ్మివేస్తున్న వీడియో వైరల్ కావడంతో పెను వివాదం చెలరేగింది
By: Tupaki Desk | 21 July 2024 8:30 AM GMTఒక హోటల్ వంటవాడు తన కస్టమర్ల కోసం రెడీ చేస్తున్న రోటీల పిండిపై ఉమ్మివేస్తున్న వీడియో వైరల్ కావడంతో పెను వివాదం చెలరేగింది. సోషల్ మీడియాల్లో ఈ వీడియో పెద్ద డిబేట్ కి తెర తీసింది. అంతేకాదు.. ఇదే వీడియో ఇద్దరు కోస్టార్ల మధ్య పెను వివాదానికి కారణమైంది.
ఆహారంలో ఉమ్మివేయడాన్ని లైట్ తీస్కోవాలని సూచిస్తూ సోనూసూద్ ఏకంగా రామాయణంలో శబరితో ఉమ్మివేసిన వాడిని పోల్చాడు. శబరి బెర్రీలు తిన్న తర్వాత వాటిలో తియ్యగా ఉన్న వాటిని మాత్రమే బుట్టలో వేస్తుంది. చేదుగా ఉన్నవాటిని దూరంగా విసిరేస్తుంది. తన రాముని కోసమే అలా చేస్తుంది! అని అన్నాడు.
కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల హోటళ్లలో వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ - హరిద్వార్ అధికారులు నిబంధనలు విధించగా... దానికి ప్రతిస్పందనగా ఒక విక్రేత ఆహారంలో ఉమ్మివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోను ప్రదర్శిస్తూ ''మానవత్వం'' అనే పేరు మాత్రమే ప్రదర్శించాలని సోనూ చెప్పాడు. ఆ ఉమ్మి వేసిన వాడు శబరి అనే అర్థంలో వ్యాఖ్యానించాడు.
దీనికి సోనూ సూద్ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇంతలోనే నటి కం ఎంపీ కంగనా రనౌత్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందిస్తూ ...దేవుడు, మతం గురించి తన వ్యక్తిగత పరిశోధనల ఆధారంగా సోనూ జీ తన సొంత రామాయణానికి దర్శకత్వం వహిస్తాడని మనకు తెలుసు. వాహ్ క్యా బాత్ హై బాలీవుడ్ సే ఏక్ ఔర్ రామాయణం! అంటూ తనదైన శైలిలో అవహేళన వేసింది.
సోనూ సూద్ తనకు తెలిసిన రామాయణ కథలో రాముడు-శబరి ఎపిసోడ్ ని వివరించే ప్రయత్నం చేసాడు. నైవేద్యాలు రుచి చూడకూడదని తెలియక రాముడికి ఉత్తమమైన బెర్రీలను మాత్రమే సమర్పించాలని శబరి లక్ష్యంగా పెట్టుకుందని వివరించే ప్రయత్నం చేసాడు. కానీ కంగన ఫిరంగులతో అతడిపై విరుచుకుపడింది.
కంగనా వ్యాఖ్యలపై స్పందిస్తూ సోనూ హిందీలో ఇలా రాశాడు. ''ఆహారంలో ఉమ్మివేసేవారిని నేను ఎప్పుడూ సమర్థించలేదు. అది ఎప్పటికీ మారని వారి పాత్ర. ఇందుకు వారిని కఠినంగా శిక్షించాలి. అయితే మానవత్వం మానవత్వంగానే ఉండనివ్వండి మిత్రమా. మనం ఒకరికొకరు వివరించుకోవడానికి వెచ్చించే సమయాన్ని, నిరుపేదల కోసం వెచ్చించాలి! సన్మార్గం ద్వారా వెళదామని నేను మీ అందరికీ చెబుతాను. నేను UP ప్రభుత్వ పనికి పెద్ద అభిమానిని. యూపీ, బీహార్‌లోని ప్రతి ఇల్లు నా కుటుంబం. గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రం, నగరం, మతం, మీకు ఏదైనా అవసరమైతే, నాకు తెలియజేయండి'' అని అన్నాడు.
ఈ గొడవ ఇప్పటిది కాదు:
కంగన వర్సెస్ సోనూసూద్ వివాదం ఇప్పటిది కాదు! ఇంతకుముందు 'మణికర్ణిక' సినిమా చిత్రీకరణ సమయంలో కూడా సోనూసూద్ తో కంగన వివాదం బయటపడింది. మెజారిటీ భాగం మణికర్ణికను చిత్రీకరించిన తెలుగు దర్శకుడు క్రిష్ ని అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుంచి తప్పించింది కంగన. అయితే అది నచ్చని సోనూసూద్ మణికర్ణిక నుంచి భేషరతుగా తప్పుకున్నాడు. క్రిష్ తో పాటు సోనూ కూడా ఈ సినిమా కి దూరమయ్యాడు. ప్రమోషన్స్ లోను అతడు కనిపించలేదు. అప్పటి నుంచి ఇరువురి నడుమా యుద్ధం సైలెంట్ గా నడుస్తోంది. భాజపా వ్యతిరేక సోను సూద్ ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ క సపోర్ట్ చేసాడు. అదే సమయంలో భాజపా అతడిపై ఐటీ దాడులు కూడా చేయించింది. చివరికి భాజపా నాయకురాలైన కంగనతో వైరం ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయనేది అందరూ గమనించాలి.