కంగువా బాక్సాఫీస్: సెంచరీ సాధ్యమే కానీ..
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో, శివ దర్శకత్వంలో తెరకెక్కిన వార్, ఫాంటసీ చిత్రం ‘కంగువా’ భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైంది.
By: Tupaki Desk | 17 Nov 2024 10:10 AM GMTకోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో, శివ దర్శకత్వంలో తెరకెక్కిన వార్, ఫాంటసీ చిత్రం ‘కంగువా’ భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైంది. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే భారీ హైప్ సృష్టించింది. అయితే, ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రేక్షకుల నుండి కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మౌత్ టాక్ అనుకూలించకపోయినా, ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు 31 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండు రోజుల్లో మొత్తం కలెక్షన్లను 89.32 కోట్ల రూపాయలకు చేరింది. ఆదివారం రోజు ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరనున్నట్లు ముందే క్లారిటీ వచ్చేసింది. సోమవారంతో పూర్తి లెక్కలపై ఒక క్లారిటీ రానుంది. అయితే, భారీ బడ్జెట్ నేపథ్యం, నిర్మాతల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుంటే, ‘కంగువా’ మరో వారం రోజులు గట్టి కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉంది.
ఇక మరోవైపు అమరన్ సినిమా వచ్చి రెండు వారాలైనా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడం కంగువాకు మైనస్ గా మారుతోంది. ఏదేమైనా కంగువా ఇలాంటి టాక్ తో పోరాటం చేస్తోంది అంటే అది కేవలం సూర్య వల్లనే. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఒకవైపు పూర్వకాలంలో యుద్ధ వీరుడిగా, మరోవైపు ఆధునిక కాలంలో బౌంటీ హంటర్ ఫ్రాన్సిస్ పాత్రలో ఆయన మెరిసారు. సూర్య పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నా, కథన పరంగా కొంత విభేదాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చిత్రానికి జోడించిన హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. బాలీవుడ్ నటులు బాబీ దియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. బాబీ విలన్ పాత్రలో ప్రేక్షకుల అభిమానం పొందగా, దిశా పటానీ పాత్ర కొంతవరకు రెగ్యులర్ గానే ఉంది.ఈ చిత్రాన్ని కే. ఈ. జ్ఞానవేల్ రాజా తన గ్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించగా, యూవీ క్రియేషన్స్ భాగస్వామిగా ఉంది.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, టెక్నికల్ పరంగా కూడా మెరుగ్గా నిలిచింది. మొదటి రెండు రోజుల కలెక్షన్లు చూస్తుంటే, ప్రపంచ వ్యాప్తంగా ‘కంగువా’ మంచి వసూళ్లు రాబడుతుందని అర్థమవుతోంది. కానీ సినిమా విజయాన్ని మరింత స్థిరంగా నిలబెట్టుకోవాలంటే, వీక్‌డేల్లో కూడా అదే జోష్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరికొన్ని రోజుల్లో పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, ‘కంగువా’ విజయానికి రాబోయే రోజులు కీలకం కానున్నాయి. సినిమా సక్సెస్‌పై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆశలుపెట్టారు. మరి ‘కంగువా’ 100 కోట్లను దాటిన తర్వాత ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.