24 రోజుల్లోనే ఓటీటీకి స్టార్ హీరో మూవీ
సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ క్లోజ్ కావడంతో పాటు నిర్మాత కొంతలో కొంత అయినా నష్టాన్ని భర్తీ చేసుకునే ఉద్దేశ్యంతో వారం ముందుగానే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2024 11:15 AM GMTతమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యిందని, దాదాపుగా రూ.175 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగువా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇండియన్ సినీ చరిత్రలో అతి పెద్ద ప్లాప్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా రూ.130 కోట్ల నష్టంతో బాక్సాఫీస్ రన్ క్లోజ్ అయ్యింది. తీవ్రంగా నిరాశ పరచినా ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా అన్ని సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కనుక ఈ సినిమా సైతం డిసెంబర్ 13 లేదా 14న ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారితో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు భావించారు.
సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ క్లోజ్ కావడంతో పాటు నిర్మాత కొంతలో కొంత అయినా నష్టాన్ని భర్తీ చేసుకునే ఉద్దేశ్యంతో వారం ముందుగానే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. డిసెంబర్ 8వ తారీకున ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ ప్రపంచంలో వదలబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా విడుదల అయినప్పటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు శివ తదుపరి సినిమాను అజిత్‌తో చేయబోతున్నాడు.
బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచిన కంగువా సినిమా కనీసం ఓటీటీ ద్వారా అయినా పరువు నిలిపేనా అంటూ ఆసక్తికరంగా సూర్య అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమిళ్‌తో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమాను డిసెంబర్ 8న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. కంగువా సినిమాలో రెండు తెగల మధ్య ఆధిపత్యంకు సంబంధించిన కథను చూపించడం జరిగింది. కథ బాగానే ఉన్నా దాన్ని చూపించిన విధానం బాగా లేదు అంటూ విమర్శలు వచ్చాయి.