10 వేల మందితో 'కంగువ' వార్ సీన్
ఇటీవల రిలీజైన కంగువ టీజర్ కి అద్భుత స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 May 2024 12:58 PM GMTతమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 'దరువు' శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సాగా అంటూ ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. క్లైమాక్స్ చిత్రీకరణ కోసం 10 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చయిందని, మొత్తం చిత్రాన్ని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రీకరించామని మేకర్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఇటీవల రిలీజైన కంగువ టీజర్ కి అద్భుత స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కంగువ' టీమ్ మొత్తం క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడి పనిచేశారని దర్శకనిర్మాతలు వెల్లడించారు. భారీతనం నిండిన వార్ సీక్వెన్స్ కి న్యాయం చేయడానికి ఏకంగా 10,000 మందితో దర్శకుడు సన్నివేశాన్ని తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశానికి సంబంధించిన యాక్షన్, స్టంట్స్, విజువలైజేషన్‌ని అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన బృందం పర్యవేక్షించింది. భారతీయ సినిమాలో మునుపెన్నడూ లేనంతగా సినిమాటిక్ గ్రాండియారిటీని అందించేందుకు చాలా జాగ్రత్తగా తీసుకున్నారని కూడా తెలిసింది. వార్ సీక్వెన్స్ ని పదివేల మందితో చిత్రీకరించడం అంటే గ్రాఫిక్స్ లో దీనిని లక్షలాది మంది యుద్ధభూమిలో పోరాడుతున్నట్టుగా ఎలివేట్ చేయడం సాధ్యం కానుంది.
టీజర్‌లో ఇప్పటికే సూర్య - బాబీ డియోల్‌ల మధ్య వార్ సీక్వెన్స్ రక్తి కట్టించింది. కథానాయకుడు సూర్య ఊచకోత, రక్తపాతం గగుర్పాటుకు గురి చేసింది. సూర్య వర్సెస్ బాబీ డియోల్.. ఒకరితో ఒకరు యుద్ధం చేయడంతో టీజర్ ముగుస్తుంది. టీజర్ విడుదల అనంతరం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
కంగువ కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ సినిమాలో తన ద్విపాత్రాభినయం గురించి సూర్య ఇటీవల ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. 'కంగువ' కోలీవుడ్‌లో బాబీ డియోల్ కి తొలి చిత్రం. అలాగే దిశా పటానీకి అక్కడ ఆరంగేట్ర చిత్రం. బాబి ఇందులో ఉధిరన్ అనే పాత్రను పోషించాడు. ఈ చిత్రం ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో రక్తి కట్టించనుంది. ఇందులో DOP నటరాజ్, జగపతి బాబు, KS రవికుమార్, యోగి బాబు, రెడిన్ కింగ్స్ లీ, కోవై సరళ, ఆనందరాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. 2డి మరియు 3డి రెండింటిలోనూ 10 విభిన్న భాషలలో పాన్ ఇండియాలో విడుదల కానుంది.