పీకల్లోతు కష్టాల్లో ఆ సినీ పరిశ్రమ!
అయితే సరిగ్గా ఇదే సమయంలో శాండిల్ వుడ్ కి గట్టి షాక్ తగిలినట్లు అయింది.
By: Tupaki Desk | 17 Jun 2024 9:30 AM GMTటాలీవుడ్, కోలీవుడ్ తర్వాత ఈ మధ్య కాలంలో కన్నడ, మలయాళ పరిశ్రమలు కూడా బాగా పుంజుకు న్నాయి. అక్కడ సినిమాలకు పాన్ ఇండియాలో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా 'కేజీఎఫ్' తర్వాత శాండిల్ వుడ్ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ సినిమా విజయంతో ఇండస్ట్రీలో నిర్మాణ వ్యయం పెరిగింది. భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం ఊపందుకుంది. ఇండస్ట్రీకి కొత్త నిర్మాతల జోరు పెరిగింది. ఔత్సాహిక కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి వచ్చి సత్తా చాటుతున్నారు.
డే బై డే ఇండస్ట్రీ వృద్దిలోకి వస్తుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో శాండిల్ వుడ్ కి గట్టి షాక్ తగిలినట్లు అయింది. ఇండస్ట్రీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కనిపిస్తుంది. కొత్త రిలీజ్ లు పెద్దగా లేకపోవడంతో థియేటర్ల వైపు ప్రేక్షకులు రావడం లేదు. దీంతో వాటిని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నిర్మాణ సంస్థలు, నిర్మాతల మధ్య వ్యక్తిగత వివాదాలు పరిశ్రమని ఇరకాటంలోకి నెట్టుతున్నాయి.
హత్యలు, విడాకులు, వివాదాలతో కుమ్ములాట ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, రెబల్ స్టార్ అంబరీష్, సాహస సింహ విష్ణు వర్దన్ వంటి హేమా హేమీలతో విరజిల్లని పరిశ్రమ ఇప్పుడు అప్రతిష్ట పాలవుతుంది. గడిచిన ఆరు నెలల కాలంలో వందకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో హిట్లు తక్కువ. ప్లాప్ లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిని డిజిటిల్ మాధ్యమాల్లో బిజినెస్ చేయడం కష్టతరమైంది.
వాటిని కొనడానికి ముందుకు రాకపోవడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నిర్మాతల మధ్య వివాదాలు పొడసాగాయి. లేని పోని రాజకీయాలు ఇండస్ట్రీకి ఆపాదించడంతోనే ఈ దుస్తితి వచ్చిందని కొంత మంది నిర్మాతలు ఆరోపిస్తున్నారు. అలాగే గోవాలో కొంత మంది కన్నడ నిర్మాతల మధ్య గొడవ జరిగింది. గణేష్ అనే నిర్మాతపై దాడి జరిగింది. ఇది ఇండస్ట్రీకి చెడ్డ పేరుగా మారింది.
ఏడాది ఆరంభం నుంచే పరిశ్రమలో వివాదాలు మొదలయ్యాయి. కళాకారులు, సాంకేతిక నిపుణుల వ్యక్తిగత జవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు దారి తీసాయి. అలాగే నటీనటుల కాపురాల్లోనూ కలతలు చోటు చేసుకోవడం ఇండస్ట్రీపై ప్రభావం చూపింది. జైళ్లు, కోర్టులంటూ నటీటనలు తిరగడం నెగిటివ్ గా మారింది. ఇటీవలే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఏకంగా మర్డర్ కేసులో ఏవన్ గా ఉండటంతో దేశ వ్యాప్తంగా కన్నడ పరిశ్రమ పేరు మరోసారి మారుమ్రోగింది. ఇవన్నీ శాండిల్ వుడ్ ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.