హాస్టల్ పిల్లలు కోరుకుంటే.. మరో కాంతార!
కన్నడ పరిశ్రమ వైపు అందరు చూసే విధంగా 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' సినిమా చేస్తోంది.
By: Tupaki Desk | 25 July 2023 3:48 AM GMTఒకప్పుడు సౌత్ సినిమా అంటే తెలుగు.. తమిళ సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. బూతు సినిమాల ఇండస్ట్రీగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి పేరు ఉండేది. కన్నడ సినిమా ఇండస్ట్రీ పరిధి మాత్రం చాలా చాలా తక్కువగా ఉండేది. అలాంటి కన్నడ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలను అందిస్తూ.. ప్రతిభావంతులైన నటీ నటులను సాంకేతిక నిపుణులను అందిస్తున్న విషయం తెల్సిందే.
కన్నడ సినిమా స్థాయి కేజీఎఫ్ తో బయటకు వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడంతో పాన్ ఇండియా ప్రేక్షకులు.. ఫిల్మ్ మేకర్స్ కన్నడ సినిమాల వైపు చూడటం మొదలైంది. కేజీఎఫ్ తో పాటు కాంతార.. కిరిక్ పార్టీ... చార్లీ 777 వంటి చిత్రాలు కూడా కన్నడ సినిమా స్థాయిని మరింత పెంచాయి అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు కన్నడ పరిశ్రమ వైపు అందరు చూసే విధంగా 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' సినిమా చేస్తోంది. లో బడ్జెట్ మూవీగా రూపొందిన ఈ సినిమా కంటెంట్ నచ్చి ప్రముఖ స్టార్ రక్షిత్ శెట్టి సమర్పించేందుకు ముందుకు వచ్చాడు.. అంతే కాకుండా కొన్ని నిమిషాల పాటు సినిమాలో కనిపించాడు.
మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే సినిమా కు కన్నడ నాట పాజిటివ్ టాక్ దక్కింది. మొదటి రోజు తో పోల్చితే రెండవ రోజు కలెక్షన్స్ ఎక్కువగా నమోదు అయ్యాయి. అలా రోజు రోజు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. యూత్ ను బాగా కట్టి పడేస్తున్న కంటెంట్ ఉన్న ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.
హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే అంటే తెలుగు లో హాస్టల్ పిల్లలు కోరుకుంటే అని అర్థం. నితిన్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హాస్టల్ లో ఉండే కుర్రాళ్ల మధ్య సాగే క్రైమ్ కామెడీ కథ ఇది. హాస్టల్ లోని ఒక రూమ్ లో అయిదుగురు ఉంటారు. వారిలో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని కోరిక. కానీ పరీక్షలు ఉండటం వల్ల మిగిలిన వారు అందుకు అంగీకరించరు.
ఆ సమయంలోనే హాస్టల్ వార్డెన్ చనిపోతాడు. తన చావుకు ఆ అయిదుగురు కారణం అంటూ సూసైడ్ నోట్ రాస్తాడు. దాంతో షాక్ అయిన ఆ అయిదుగురు ఏం చేస్తారు.. అసలు ఆ వార్డెన్ ఎందుకు చనిపోయాడు... వీళ్లు కారణం అంటూ సూసైడ్ నోట్ ఎందుకు ఉంది అనేది స్క్రీన్ ప్లే ను చాలా సరదాగా నడిపించారు.
కథ.. స్క్రీన్ ప్లే యూనివర్శిల్ సబ్జెక్ట్. ఏ భాషలో అయినా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కనుక త్వరలోనే ఈ సినిమా అన్ని భాషల్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాంతార మాదిరిగా ఈ సినిమా డబ్బింగ్ అయ్యి అన్ని భాషల్లో వినోదాన్ని పంచుతుందా లేదంటే రీమేక్ అవ్వబోతుందా అనేది చూడాలి. మొత్తానికి కన్నడ సినిమా పరిశ్రమలో మరో కాంతార అంటూ ఈ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.