ఆరాటపడితే సరిపోదు.. కంటెంట్ కూడా..
కోవిడ్ సమయంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిందన్న విషయం తెలిసిందే. వైరస్ భయంతో బయటకు వెళ్లలేక ఇంట్లోనే చక్కగా కూర్చుని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేశారు.
By: Tupaki Desk | 26 April 2024 5:14 AM GMTకోవిడ్ సమయంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిందన్న విషయం తెలిసిందే. వైరస్ భయంతో బయటకు వెళ్లలేక ఇంట్లోనే చక్కగా కూర్చుని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేశారు. అలా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఇక ఆయా ఓటీటీల నిర్వాహకులు కూడా సినీ ప్రియులను అలరించేందుకు కొత్త చిత్రాలు, సిరీసులను ప్రతి వారం స్ట్రీమింగ్ చేస్తున్నారు. పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సొంతంగా కూడా తెరకెక్కిస్తున్నారు.
అయితే కన్నడ సినిమా ఇండస్ట్రీ దశ, దిశను ప్రశాంత్ నీల్- యష్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ మొత్తం మార్చేసింది. ఆ మూవీ తర్వాత తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ ఎక్కువైపోయింది. పలు కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి. థియేటర్లలోనే కాదు అమెజాన్ ఫ్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి బడా ఓటీటీల్లో పలు శాండిల్ వుడ్ చిత్రాలు అన్ని భాషల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
అందులో హై క్వాలిటీ అండ్ సూపర్ హిట్ కన్నడ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. శాండల్ వుడ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు మొగ్గు చూపడం లేదు. అలాంటి సినిమాలన్నింటికీ ఒక ప్రత్యేక స్ట్రీమింగ్ సర్వీస్ ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నమ్మ ఫ్లిక్స్ (Namma Flix) ఉన్నప్పటికీ పెద్దగా అటు ఎవరూ చూడటం లేదు.
దీంతో మేకర్స్ అంతా తమ చిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయా ఓటీటీలు ఫుల్ ఫేమస్ కాబట్టి.. నటీనటుల టాలెంట్ కచ్చితంగా బయటపడుతుంది. డబ్బులు విషయం పక్కన పెడితే ఫేమ్ మాత్రం వస్తుంది. కానీ బడా ఓటీటీ నిర్వాహకులు ఆచితూచి సినిమాలు కొంటున్నారు. అందుకే ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీని చూసి కన్నడ మేకర్స్ నేర్చుకోవాలని సినీ పండితులు చెబుతున్నారు.
మలయాళ పరిశ్రమలాగా కన్నడ ఇండస్ట్రీ కూడా మంచి సినిమాలు, కంటెంట్ పై దృష్టి పెడితే బాగుంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు మాలీవుడ్ చిత్రాలు కూడా వివక్షను ఎదుర్కొన్నాయని, కానీ కంటెంట్ బాగుండడంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నారు. అప్పుడు కచ్చితంగా బడా ఓటీటీలు ఆ సినిమాలను కొనుగోలు చేస్తాయని, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వాటికి ఉదాహరణగా వివరిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.