కేరళలో దుమ్ము దులిపేస్తున్న మమ్ముట్టి సినిమా
కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా 'కన్నూర్ స్క్వాడ్'. మమ్ముట్టి నటించి ఈ మూవీని నిర్మించారు.
By: Tupaki Desk | 19 Oct 2023 8:40 AM GMTమమ్ముట్టి..మలయాళంలో మెగాస్టార్. అయినా సరే ఇప్పటికీ విభిన్నమైన కథలతో సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. అప్పుడప్పుడు తెలుగులోనూ 'యాత్ర', ఏజెంట్ వంటి సినిమాల్లో మెరుస్తూ తెలుగు ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్న మమ్ముట్టి తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా 'కన్నూర్ స్క్వాడ్'. మమ్ముట్టి నటించి ఈ మూవీని నిర్మించారు.
రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రియల్ లైఫ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని మమ్ముట్టి కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా రన్ టైమ్ 160 నిమిషాలు. సుధీర్ఘ రన్ టైమ్ ఉన్నప్పటికీ ఏ విషయంలోనూ ప్రేక్షకులని నిరుత్సాహపరచదు.
ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో సాగుతూ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌లలో అత్యంత ప్రజాదారణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీని సృష్టిస్తోంది. సెకండ్ హాఫ్‌లో రెగ్యులర్ హీరోయిజానికి పూర్తి భిన్నంగా మమ్ముట్టి పాత్రని చూపించిన తీరు ప్రేక్షకులకు ఓ ఫ్రెష్ సినిమాని చూస్తున్న ఫీల్‌ని కలిగిస్తుంది. రెగ్యులర్ హీరోయిజం, హై రేంజ్ బిల్డప్ షాట్లు, రొమాంటిక్ సీన్‌లు వంటివి ఏవీ లేకుండా సినిమాటిక్ ఫార్మాట్‌కి పూర్తి భిన్నంగా ఈ సినిమాని రూపొందించారు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సినిమాలో చెప్పుకోదగ్గ లోపాలున్నా అవన్నీ కథ, కథనాల ముందు తేలిపోయాయి. ఇక 72 ఏళ్ల వయసులో ఇన్వేస్టిగేటివ్ ఆఫీసర్‌గా మార్టిన్ జార్జ్ పాత్రలో మమ్ముట్టి కనబరిచిన అభినయం అద్భుతం అనిపించక మానదు.
ఇక నిర్మాణం పరంగా ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో చేసినా ఓ బెంచ్ మార్క్‌ని సెట్ చేశారు. దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్‌కిది తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు కనిపించలేదు. చాలా చక్కగా సినిమాని ఓ అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా అనూహ్యంగా వరల్డ్ వైడ్‌గా రూ.75 కోట్ల మేర వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని షాక్‌కు గురి చేస్తోంది.