సెలబ్రిటీలను మోసం చేసాడంటూ బిజినెస్‌మేన్ అరెస్ట్!
ఫ్యాషన్ ఇండస్ట్రీ, జువెలరీ రంగంలో పెట్టుబడుల పేరుతో భారీగా నిధులను సమీకరించి పలువురిని మోసం చేసారంటూ ప్రముఖ బిజినెస్ మేన్ కాంతి దత్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు.
By: Tupaki Desk | 1 Dec 2024 11:53 AM GMTఫ్యాషన్ ఇండస్ట్రీ, జువెలరీ రంగంలో పెట్టుబడుల పేరుతో భారీగా నిధులను సమీకరించి పలువురిని మోసం చేసారంటూ ప్రముఖ బిజినెస్ మేన్ కాంతి దత్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. శ్రీజా రెడ్డి అధికారిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని విచారిస్తున్నారని ప్రముఖ మీడియాల్లో కథనాలు వచ్చాయి. బ్రాండెడ్ నేమ్ తో ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించి దీనికి పరిణీతి చోప్రాను ప్రచారకర్తగా నియమించడమే గాక.. తనతో పెట్టుబడులు పెట్టించారని, పరిణీతికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని చెల్లించేందుకు శ్రీజ రెడ్డి నుంచి కోటిన్నర తీసుకున్నారని కాంతిదత్ పై ఆరోపణలు వచ్చాయి.
కాంతి దత్ తనకు ఉన్న సెలబ్రిటీ కనెక్షన్ ని ఉపయోగించుకుని వ్యాపారాలను వృద్ధి చేయాలనుకున్నారు. అదనపు స్టోర్లను ప్రారంభిస్తూ, కొత్త వ్యాపారాల్లోను ప్రవేశించి అతడు భారీగా పెట్టుబడులను సమీకరించి పెట్టాడు. అయితే ఈ డబ్బును పలువురు సెలబ్రిటీల నుంచి అతడు సేకరించి మోసం చేసాడని కథనాలొచ్చాయి. పెట్టుబడి దారులకు లాభాలు రాకపోవడం.. కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదనే ఆరోపణలు తొలిగా వచ్చాయి. అయితే ఈ కేసులో మోసపోయిన సెలబ్రిటీలెవరూ అతడిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని మీడియాలు కథనాలు రాసాయి.
శ్రీజారెడ్డి తొలిగా ఫిర్యాదు చేయగా, ఇకపై అతడిపై ఫిర్యాదు చేసేందుకు మరింత మంది బాధితులు ముందుకు వస్తారని భావిస్తున్నారు. సరైన రాబడులు లేదా జవాబుదారీతనం లేకుండా వివిధ వ్యాపార సాకులతో పెట్టుబడులను సేకరించే విధానంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు కాంతి దత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సస్టయిన్‌కార్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన కాంతి దత్ 5 రోజుల క్రితం తన ఇన్‌స్టాలో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైన తప్పుడు ఆరోపణలు అని పేర్కొన్నారు. కంపెనీ చర్యలన్నీ ఇండియా యాక్సిలరేటర్ (IA), వారి సమ్మతి .. నిధుల సమీకరణ సలహాదారులతో ఒప్పందంలో ఉన్నాయని వివరించారు. కలిసి పనిచేసినప్పటికీ IA స్టార్టప్‌కి వ్యతిరేకంగా మారింది. వారి ప్రతిష్టను కాపాడుకోవడానికి మాపై ఆరోపించారు. సస్టయిన్‌కార్ట్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించలేదని, సేఫ్ నోట్స్ ద్వారా సేకరించిన ఐదు లక్షల డాలర్లను ప్రైవేట్ లేబుల్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ కోసం ఉపయోగించామని కాంతి స్పష్టం చేసారు. సంస్థల్లో పెట్టుబడులు కారణంగా నిధులను త్వరగా కోల్పోయామని తెలిపారు. తమకు ఎదురైన సవాళ్లపై విచారం వ్యక్తం చేసారు. సస్టెయిన్ కార్ట్ వ్యవస్థాపకుడు అయిన కాంతి దత్ చెబుతున్న దానిని బట్టి తాను సక్రమ పద్ధతిలోనే వ్యాపారం చేసినా కానీ, రాబడి ఆశించిన విధంగా రాకపోవడం వల్లనే కంపెనీలు సమస్యల్లో చిక్కుకున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.