భారీ మల్టీస్టారర్ రిజల్ట్.. కరణ్ చెప్పింది వినలేదా!
అంతేకాదు తాను మునుముందు అలాంటి సినిమాలు చేయడానికి సిద్ధంగా లేనని చెప్పాడు.
By: Tupaki Desk | 28 Nov 2024 8:30 PM GMTభారీ బడ్జెట్లు వెచ్చించి అగ్ర కథానాయకులతో తెరకెక్కించే సినిమాలు విజయం సాధించినా కానీ, నిర్మాత లేదా పంపిణీ వర్గాలకు అది ఏమంత లాభదాయకంగా లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ విశ్లేషించారు. అంతేకాదు తాను మునుముందు అలాంటి సినిమాలు చేయడానికి సిద్ధంగా లేనని చెప్పాడు. రణబీర్ తో బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రం విజయం సాధించినా కానీ నిర్మాతకు మిగిలిందేమీ లేదని కూడా తేలింది. అందుకే కరణ్ ఇకపై తాను 70-80 కోట్ల రేంజు బడ్జెట్లకే కమిటై ఉన్నానని కూడా వెల్లడించాడు. ఆ బడ్జెట్లో సినిమాలు తీస్తేనే రికవరీ సులువుగా ఉంటుందని, లాభాలు కూడా పెద్దగా కళ్ల జూడగలమని అన్నారు.
అయితే కరణ్ ప్రతిపాదించిన ఈ ఫార్ములాని ఇటీవలే రిలీజైన ఓ రెండు సినిమాలకు ఆపాదిస్తే, కచ్ఛితంగా అది అతుకుతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన `సింగం ఎగైన్` ఇటీవల విడుదల కాగా విజయం అందుకుంది. రోహిత్ శెట్టి కాప్ డ్రామాకు మంచి రివ్యూలే వచ్చాయి. అయితే ఈ సినిమా వల్ల నిర్మాతలకు ఒరిగిందేమీ లేదని తేలింది. లాభాల మార్జిన్ చాలా కుంచించుకుపోయిందనేది నిర్మాతల వెర్షన్. మరోవైపు భూల్ భులయా 3 కూడా ఈ సీజన్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే పెట్టిన పెట్టుబడికి మంచి రాబడిని తెచ్చిన చిత్రంగా ఇది నిలిచింది. సింగం ఎగైన్ తో వచ్చిన లాభాలతో పోలిస్తే మెరుగైన ఫలితాన్ని బిబి 3 రాబట్టింది.
ఇక `సింగం ఎగైన్` కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేయడంతో పెద్ద మొత్తంలో పారితోషికాలు వారికి చెల్లించాల్సి రావడం కూడా కొంత ఇబ్బందికర పరిణామం. మరోవైపు టాప్ కాస్టింగ్ ఉన్నా కానీ, కంటెంట్ పరంగా ఆశించిన రీచ్ లేదని కూడా ఒక విశ్లేషణ ఉంది. అంతమంది స్టార్ల మధ్య అజయ్ దేవగన్ కనిపించడం అభిమానులకు అంతగా నచ్చలేదని కూడా ఒక సెక్షన్ కామెంట్లు చేసింది. ఓవరాల్ గా సింగం ఎగైన్ .. బాహుబలి లేదా పఠాన్ రేంజుకు చేరుకోలేకపోవడానికి కారణాలు సుస్పష్ఠంగా ఉన్నాయి. రోహిత్ శెట్టి తెరకెక్కించిన గత సినిమాలు పోటీబరిలో వచ్చాయి. కొన్నిసార్లు విజయాలు వచ్చాయి. కొన్నిసార్లు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కానీ ఈసారి లాభాలు తేవడంలో విఫలమయ్యాడు అని సెటైరికల్ గా స్పందిస్తున్నారు.