నెపో కిడ్స్ టార్గెట్ .. కరణ్‌పై బిగ్ డిబేట్
అగ్రదర్శకనిర్మాతగా ఆయనకు ఉన్న ఛరిష్మా కారణంగా ధర్మ ప్రొడక్షన్స్ లోనే లాంచ్ కావాలని నటవారసులు ఉవ్విళ్లూరుతుంటారు.
By: Tupaki Desk | 30 Jan 2025 2:30 AM GMTబాలీవుడ్లో ఎందరో స్టార్ల నటవారసులను లాంచ్ చేసారు కరణ్ జోహార్. అగ్రదర్శకనిర్మాతగా ఆయనకు ఉన్న ఛరిష్మా కారణంగా ధర్మ ప్రొడక్షన్స్ లోనే లాంచ్ కావాలని నటవారసులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే కరణ్ కేవలం నటవారసులపైనే దృష్టి సారించి, ఔట్ సైడర్స్ కి ప్రాధాన్యతనివ్వకపోవడంపై చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన దృష్టి ఇన్ సైడర్స్ అయిన 'నెపో కిడ్స్' పైనే ఉంటుందని చాలా మంది విమర్శించారు.
ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ ల కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నానని.. ఇది అద్భుతమైన లాంచ్ అవుతుందని కరణ్ జోహార్ ప్రకటించారు. సైఫ్- అమృతల కుటుంబంతో తనకు ఉన్న చిరకాల అనుబంధాన్ని ఎంతో గౌరవిస్తానని అతడు అన్నారు. కొత్త ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే తన ఉత్సాహాన్ని కరణ్ బహిర్గతం చేసాడు. తనవద్ద సహాయకుడిగా పని చేసిన ఇబ్రహీంని పరిచయం చేయడం ఆనందంగా ఉందని అన్నాడు.
సామాజిక మాధ్యమాల్లో ఇబ్రహీం లాంచింగ్ గురించి ప్రకటించిన కరణ్ అతడి ఫోటోలను కూడా షేర్ చేసారు. సైఫ్- ఇబ్రహీం కుటుంబంతో కరణ్ కి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు నటవారసుడి డెబ్యూ చిత్రాన్ని సక్సెస్ చేయడానికి కరణ్ చేయాల్సినదంతా చేస్తున్నారు. అదే సమయంలో సైఫ్ ఖాన్ అభిమానులు ఇబ్రహీం ఆరంగేట్ర ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలని ఉత్సాహంగా ఉన్నారు.
కరణ్ తాజాగా సుదీర్ఘ ఇన్‌స్టా పోస్ట్ లో సైఫ్ అలీఖాన్ కుటుంబంతో అనుబంధం గురించి బయటికి తెలియని చాలా విషయాలు చెప్పారు. తాను కేవలం 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమృతను మొదటి సారి కలిసానని, తనలో దయ, సహృదయం, ప్రతిభను చూసానని అన్నాడు. సైఫ్ ని మొదటిసారి కలిసినప్పుడు అతడు ఇబ్రహీం లాగే యూత్‌ఫుల్ గా చలాకీగా ఉన్నాడని, సున్నిత మనస్కుడు, మనోహరమైనవాడు అని పొగిడేసారు. నేను అమృతను డింగీ అని కూడా పిలుస్తాను. నా 12ఏళ్ల వయసులో నాన్నగారు తెరకెక్కించిన `దునియా` చిత్రంలో డింగీ నటించారు. కెమెరా ముందు తన ప్రదర్శన నాకు ఇంకా గుర్తుంది. అమృత.. ఆమె హెయిర్స్టైలిస్ట్తో చైనీస్ విందును ఆస్వాధించానని, ఆ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాను కలిసి చూసామని తెలిపారు. అమృతలోని దయ, శక్తి పిల్లలకు వారసత్వంగా వచ్చాయని అన్నారు. సైఫ్‌తో కల్ హో నా హో, కుర్బాన్ చిత్రాలకు కరణ్ పని చేసారు. నేను ఇబ్రహీంను మొదటిసారి కలిసినట్లే సైఫ్ యూత్ ఫుల్ గా ఆకర్షణీయంగా ఉన్నాడు. మా తరం నుండి అదృష్టవశాత్తూ నేటితరం పిల్లల వరకు బలమైన స్నేహం కొనసాగుతోంది. ఈ కుటుంబం నాకు దశాబ్ధాలుగా తెలుసునని అన్నాడు. సింబా చిత్రం కోసం ఇబ్రహీం సోదరి సారా అలీ ఖాన్‌తో కూడా పనిచేశానని, తనతో మరిన్ని సినిమాలు నిర్మిస్తానని కరణ్ అన్నాడు.
31 మందిని పరిచయం చేసిన కరణ్
23 మంది అరంగేట్ర దర్శకులు. 8 మంది అరంగేట్ర నటులను తెరకు పరిచయం చేసిన ధర్మ అధినేత కరణ్ తమ బ్యానర్లలో లెక్కలేనన్ని కథలు చెప్పామని అన్నారు. ఇంకా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి. ధర్మా మూవీస్, ధర్మాటిసెంట్ లో మేం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, కొత్త వేవ్ ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.