ఫ్యామిలీ సినిమాలతో లాభం లేదని KJO యూటర్న్
అతడు తన తదుపరి చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీ అంటూ ప్రచారం చేస్తున్నాడు
By: Tupaki Desk | 5 Aug 2023 4:25 AM GMTప్రస్తుతం ట్రెండ్ మారింది. భారతీయ సినిమాల కంటెంట్ అమాంతం మారింది. యాక్షన్ సినిమాలు.. స్పై థ్రిల్లర్ లు లేదా సూపర్ హీరో సినిమాలకు దక్కే ఆదరణ రెగ్యులర్ సినిమాలకు దక్కడం లేదు. ఫ్యామిలీ కంటెంట్ లేదా లవ్ స్టోరీలు ..హారర్ జానర్ సినిమాలకు ఆదరణ దక్కుతున్నా కానీ అవి పాన్ ఇండియా రేంజ్ వసూళ్లను దక్కించుకోలేకపోతున్నాయి. దానికి తాజా ఉదాహరణ కరణ్ జోహార్ తెరకెక్కించిన రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితం అందుకోవడంతో కరణ్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడని కథనాలొస్తున్నాయి.
అతడు తన తదుపరి చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీ అంటూ ప్రచారం చేస్తున్నాడు. కరణ్ నిర్మించిన యాక్షన్ మూవీ 'కిల్' టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రీమియర్ కి రెడీ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కరణ్ ఈ చిత్రం పోస్టర్‌ను షేర్ చేసి ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్.. ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ ఆకట్టుకుంటుంది అంటూ ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. లక్ష నటించిన యాక్షన్-ప్యాక్డ్ హై ఆక్టేన్ చిత్రంలో అతడి యాక్షన్ తదుపరి లెవల్లో ఉంటుందని తెలిపాడు. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్‌లో TIFF 2023లో ప్రదర్శితమవుతుందని అధికారిక పోస్టర్ టీజర్ త్వరలో విడుదలవుతాయని తెలిపారు.
మరోవైపు తన గత చిత్రం వైఫల్యానికి కరణ్ కారణాలను అన్వేషిస్తున్నారు. KJo ప్రస్తుతం రణవీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమా ఫక్తు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. కానీ బాలీవుడ్ లో ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. సమీక్షలు పాజిటివ్ గా ఉన్నా కానీ అది వసూళ్లకు అంతగా సహకరించలేదు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 150కోట్ల లోపు వసూలు చేసింది ట్రేడ్ చెబుతోంది. విభిన్న ప్రాంతాలు నేపథ్యాలు ఉన్న యువతీయువకులు ప్రేమలో పడ్డాక ఇరువైపులా కుటుంబాలు ఈ కలయికకు ఓకే చెప్పాయా లేదా? కుటుంబ పెద్దల మధ్య సయోధ్య కుదిరిందా లేదా? అన్నదే ఈ సినిమా కథాంశం. ఫ్యామిలీ డ్రామా రొటీన్ కంటెంట్ తో ఉండడంతో ప్రజలకు పెద్దగా ఎక్కలేదని విమర్శలొచ్చాయి.