స్టార్ హీరో శరీరంలో ఆరు కత్తిపోట్లు...అసలు ఏమి జరిగింది!
రకరకాల ఊహాగానాల మధ్య బెబో బృందం అధికారిక ప్రకటన కొంత ఊరట కలిగించింది.
By: Tupaki Desk | 16 Jan 2025 6:51 AM GMTముంబైలోని బాంద్రా ఇంట్లో తన భర్త సైఫ్ అలీ ఖాన్ పై దాడి, దోపిడీకి ప్రయత్నించిన దిగ్భ్రాంతికరమైన ఘటన పై కరీనా కపూర్ ఖాన్ ఖాన్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసారు. సైఫ్ శరీరంలో ఆరు కత్తిపోట్లు దిగడంతో అభిమానులు సహా చాలా మంది సహచరులు తమ ఆందోళనను వ్యక్తం చేసారు. రకరకాల ఊహాగానాల మధ్య బెబో బృందం అధికారిక ప్రకటన కొంత ఊరట కలిగించింది. సైఫ్ సురక్షితంగా ఉన్నారని, కుటుంబం బాగానే ఉందని కరీనా వెల్లడించారు.
కరీనా కపూర్ ఖాన్ మొదటి ప్రకటన సారంశం ఇలా ఉంది. ఈ దాడితో కుటుంబం కంగారు పడినా కానీ, ఈ సవాల్ సమయంలో సైఫ్ మంచి వైద్యాన్ని పొందుతున్నారని, అభిమానుల మద్దతు కావాలని కరీనా బృందం ప్రకటించింది. శ్రేయోభిలాషుల ఆందోళనకు బెబో కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ గోప్యతను అభ్యర్థించారు.
అసలు బాంద్రా ఇంట్లో ఏం జరిగింది? అనేదానిపై కరీనా బృందం సైలెంట్ గా ఉంది. అక్కడి పరిస్థితులు, భద్రతా చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
ప్రాథమిక సమాచారం మేరకు దుండగుడు సైఫ్ ఖాన్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించగా, దానిని సైఫ్ అడ్డుకునే ప్రయత్నం చేసాడు. దీంతో అతడు కత్తితో వరుసగా పొడిచాడు. దాదాపు ఆరు కత్తి పోట్లు సైఫ్ శరీరంలోకి దిగాయని చెబుతున్నారు. వీటిలో ఒక రెండు ప్రమాదకరమైనవి అని కూడా కథనాలొస్తున్నాయి. అయితే సైఫ్ కరీనా పాలీహిల్ ఏరియాలోని ఇంట్లో నివశిస్తున్నారు. కానీ బాంద్రా ఇంట్లో సైఫ్ పై దాడి జరగడం ఆశ్చర్యపరుస్తోంది.
సైఫ్ అలీ ఖాన్ బృందం ఏం చెప్పింది?
ఘటనపై సైఫ్ ఖాన్ ప్రతినిధి మాట్లాడుతూ-``మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. మీడియా, అభిమానులు ఓపికగా ఉండాలని మేం అభ్యర్థిస్తున్నాము. ఇది పోలీసుల విషయం. పరిస్థితి ఏమిటనేది మేం మీకు తెలియజేస్తాం``అని వ్యాఖ్యానించారు.
గురువారం తెల్లవారుజామున దోపిడీ ప్రయత్నం జరిగింది. సైఫ్ శరీరంపై ఆరుచోట్ల గాయాలయ్యాయని, చికిత్స కోసం లీలావతి ఆసుపత్రికి తరలించారని కథనాలొచ్చాయి. పోలీస్ అధికారులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందే పోలీసుల బృందం పాలి హిల్‌లోని సైఫ్-కరీనా జంట నివాసానికి చేరుకుంది. కేసు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.