మేడమ్.. నేను నటినే.. గూబ గుయ్యమనే ఆన్సర్
కాలం మారినా.. అందుకు తగ్గట్లు మనుషుల మైండ్ సెట్ లో పెద్దగా మార్పు రాదు. కొన్ని విషయాల్లో పలువురు స్పందించే తీరు మొరటుగా.. అనాగరికంగా ఉంటుంది.
By: Tupaki Desk | 28 Jan 2025 5:20 AM GMTకాలం మారినా.. అందుకు తగ్గట్లు మనుషుల మైండ్ సెట్ లో పెద్దగా మార్పు రాదు. కొన్ని విషయాల్లో పలువురు స్పందించే తీరు మొరటుగా.. అనాగరికంగా ఉంటుంది. ఇలాంటి వారికి సోషల్ మీడియా లాంటి వేదికలు.. వారి వికారాలను ప్రపంచానికి తెలియజేసేలా చేస్తుంటాయి.తాజా ఉదంతం కూడా ఆకోవకు చెందిందే. టాలీవుడ్.. కోలీవుడ్ లాంటి దేశీయ సినిమాలకు పరిమితమయ్యే వారికి.. కార్లా సోఫియా గాస్కాన్ పేరును విని ఉండకపోవచ్చు.
చూసినంతనే అందమైన ఆడపిల్లగా.. మనసుల్ని కొల్లగొట్టే సౌందర్యంతో ఉన్నప్పటికి.. ఆమె ట్రాన్స్ జెండర్. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత లింగమార్పిడి సర్జరీ చేయించుకొని నటిగా మారింది. ఆమె నట విశ్వరూపానికి నిదర్శనంగా ‘ఎమీలీయా పెరెజ్’ నిలుస్తుంది. ఈ మ్యూజికల్ క్రైం మూవీలో టైటిల్ పాత్రను పోషించి.. ఉత్తమ నటిగా ఆస్కార్ కు ఎంపిక కావటంతో యావత్ ప్రపంచ చిత్ర పరిశమ్ర ఆమెపై ఒక లుక్ వేశాయి.
ఇక.. ఆమె బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. పుట్టింది స్పెయిన్ లో అయినప్పటికి.. లండన్ కు షిప్టు అయ్యింది. కామెడీ మూవీ ‘ది నోబుల్ ఫ్యామిలీ’ సక్సెస్ తో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. వరుస సినిమాలు.. వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా మారింది. ఇదిలా ఉండగా.. 2024లో రిలీజ్ అయిన ‘ఎమిలియా పెరెజ్’ మూవీలో ఆమె నటన విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. అందుకు తగ్గట్లే ఉత్తమ నటిగా.. కేన్స్ ఫిలిం పెస్టివల్ లోనూ.. యూరోపియప్ ఫిలిం అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఇదే సినిమాకు అస్కార్ బరిలోనూ నిలిచింది.
ఇంత జరిగినప్పటికి ఆమె బ్యాక్ గ్రౌండ్ టచ్ చూస్తూ.. సోషల్ మీడియాలో ఎటకారాలు ఆడేసే వారు ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒకరు సోషల్ మీడియాలో ఆమెను ఉద్దేశిస్తూ.. ‘ఉత్తమ నటి’ / ‘ఉత్తమ నటుడు’.. ఏ విభాగంలో నామినేట్ చేశారో అంటూ తన పైత్యానని ప్రదర్శించారు. దీనికి కార్లా అంతే ధీటుగా రియాక్టు అవుతూ.. ‘మేడమ్.. నేను నటిని. సినిమాల్లో రాక్షసుడిగా.. కుక్క.. ఇలా ఏ పాత్రలో నటించినా నేను ‘నటి’గానే నామినేట్ అవుతాను అంటూ..ఒత్తి పలుకుతూ గూబ గుయ్యమనేలా ఆన్సర్ ఇచ్చింది. పైత్యాన్ని ప్రదర్శించే వారికి ఆ మాత్రం షాక్ ఇవ్వాల్సిందే.