కర్నాటకలో టికెట్ రేటు.. పాన్ ఇండియా స్టార్లకు బిగ్ పంచ్!
ఇటీవలి పాన్ ఇండియా ట్రెండ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా పొరుగు భాషల్లో భారీ వసూళ్లతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 8:23 PM ISTటాలీవుడ్ అగ్ర హీరోలకు ఇది షాకిచ్చే వార్త! ప్రభాస్, పవన్ కల్యాణ్, చరణ్, మహేష్, బన్ని, ఎన్టీఆర్ ..ఇలా పాన్ ఇండియా స్టార్లకు ఇది బిగ్ బ్లో! వీళ్లంతా కర్నాటక నుంచి తమ సినిమాలు వంద కోట్లు తేవాలని కలలు కంటున్నారు. ఇటీవలి పాన్ ఇండియా ట్రెండ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా పొరుగు భాషల్లో భారీ వసూళ్లతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
మునుముందు అగ్ర హీరోలు నటించిన భారీ సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో టికెట్ రేట్లపై కర్నాటక ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారింది. ఇది అదుపు తప్పిన టికెట్ రేట్లకు ముకుతాడు వేయడమేనని చెప్పాలి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై రూ.200 పరిమితిని ప్రవేశపెట్టింది. ప్రజల్ని థియేటర్లకు భారీగా రప్పించడమే దీని ఉద్ధేశం అని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయంతో బెంగళూరులో 300-400 మధ్య చెల్లిస్తున్నవారికి చాలా కలిసి రానుంది. మారిన టికెట్ రేటుతో ఒక్కో టికెట్ ధరతోనే రెండు టికెట్లు కొనుక్కుని కపుల్ సినిమాలు చూడొచ్చు. బెంగళూరు సహా కర్నాటక వ్యాప్తంగా పెరుగుతున్న టికెట్ ధరలపై ఆడియెన్ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అధిక టికెట్ ధరల గురించి చాలా కాలంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కన్నడిగలకు ఇది మేలు చేకూర్చేదే కావచ్చు కానీ, పొరుగు నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాలకు ఇది భారీగా గండి కొట్టే చర్య. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుల సినిమాలు కర్నాటక- బెంగళూరు నుంచి భారీ వసూళ్లను తెస్తున్నాయి. కానీ ఇప్పుడు సగానికి సగం టికెట్ ధర తగ్గిపోవడంతో ఆ మేరకు ఆదాయం తగ్గిపోనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. మునుముందు చిరంజీవి-విశ్వంభర, పవన్ కల్యాణ్ - హరి హర వీరమల్లు, ప్రభాస్ - రాజా సాబ్, కల్కి 2, సలార్ 2 ..ఇవన్నీ చాలా వరకూ ఆదాయాన్ని కోల్పోతాయి. 200 లోపు టికెట్ ధరలను ఖాయం చేస్తే, పంపిణీ వర్గాలకు ఆదాయం తగ్గిపోతుంది. దీనిని బట్టి ఇప్పటికే కొనుగోలు చేసిన సినిమాలకు రెవెన్యూ దారుణంగా పడిపోతుందనే ఆందోళన పంపిణీవర్గాల్లో ఉంది.
మారిన పరిస్థితుల్లో పంపిణీదారులు నిర్మాతలను కలిసి రేట్లను రివైజ్ చేయమని కోరే అవకాశం ఉంది. దీనివల్ల ఒప్పందాలపై మరోసారి చర్చ జరిపే అవకాశం ఉంటుంది. గతంలో వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలు దారుణంగా తగ్గాయి. దీనిపై సినీవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఇప్పుడు కర్నాటక ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు నిర్మాతలు ఎలాంటి అభ్యర్థనలు చేయలేరు. అది కన్నడిగల ఇంటర్నల్ మ్యాటర్. ఇందులో తెలుగు సినీ దిగ్గజాలు చేయగలిగిందేమీ లేదు.