అలాంటి డెసిషన్లు టాలీవుడ్ లో సాధ్యం కాదా?
ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచకూడదంటూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 March 2025 7:00 PM ISTఇటీవలే కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచకూడదంటూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా అది సింగిల్ స్క్రీన్ అయినా? మల్టీప్లెక్స్ అయినా ఆ టికెట్ ధర కేవలం 200 రూపాయల లోపు మాత్రమే ఉండాలని నిర్ణయించింది. సామాన్యుడికి సినిమా టికెట్ భారం కాకూడదు..వినోదం పేరుతో అభిమానులు జేబులు గుల్ల చేసుకోకూడదు అనే కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో 600 రూపాయల వరకూ పెంచుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇకపై అలాంటి పెంపుకు ఆస్కారం లేదని ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే కౌంటర్ లో టిటెక్ తెగాలని దిశానిర్దేశం చేసింది. దీనిపై కన్నడ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుందని...టికెట్ పేరుతో ఇంత కాలం దోపీడికి గురయ్యామని, అభిమానం పేరుతో జేబులు గుల్ల చేసుకునే వాళ్లమని..ఇకపై ఆ బాధలు ఉండవని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే చిన్న సినిమా నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేసారు. ఇలా చేయడం వల్ల సినిమా నిర్మాణ వ్యయం తగ్గుతుందని...చిన్న సినిమా నిర్మాతలకు ఇది వెసులు బాటు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే కన్నడ ఇండస్ట్రీలో ఆలోచించాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. మరి ఇలాంటి నిర్ణయాలు టాలీవుడ్ లో సాధ్యం కావా? అంటే అందుకే ఈ ఐదేళ్లు ఛాన్సే ఉండదంటారు.
గతంలో వైకాపా అధికారంలో ఉన్న సమయంలో టికెట్ రేట్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిశ్రమ పెద్దలు ఇలాగైతే సినిమా నష్టపోతుందని ప్రాదేయ పడటంతో కాస్త పెంచుకునే వెసులు బాటు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ కు ఒకలా...మల్టీప్లెక్స్ కు మరోలా పెంచుకునే అవకాశం దక్కింది. అటుపై కొంత కాలానికి ఏపీలో కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడంతో మొత్తం సీన్ మారిపోయింది.
ఏ సినిమాకైనా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. భారీ బడ్జెట్ సినిమాలైతే నిర్మాతలు కోట్ చేసినట్లు పెంచుకునే వెసులుబాటు దొరికింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఇండస్ట్రీ పక్షపాతి అని ..ఇండస్ట్రీ అభివృద్దిలో భాగంగా కొన్ని రకాల సౌలభ్యాలు కల్పిస్తారనే వాదన ఎప్పటి నుంచో ఉండనే ఉంది. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టికెట్ ధరల విషయంలో మొదటి నుంచి సానుకూలంగానే ఉంది. ఆ మధ్య సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సీన్ మారుతుందనుకునే సమయంలో? పెద్దల అభ్యర్దన మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.