సినీకార్మికులు పేద కళాకారుల సంక్షేమం ఆలోచిస్తే తప్పా?
కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమ బిల్లు- 2024 ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 5 Aug 2024 5:52 AM GMTకర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమ బిల్లు- 2024 ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుతో అసంఘటిత సినీకార్మిక రంగంలో, ఆదాయం లేని బుల్లితెర, డ్రామా కళాకారులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఆకలికి అలమటించే నిరుపేదలు, కళ కోసం అన్నిటినీ అమ్ముకునే లేదా అన్నిటినీ వదులుకుని శ్రమించే వారి కోసం భారతదేశంలో మొట్టమొదటిసారి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం కర్నాటక మాత్రమే. అక్కడ నిర్ణయం ఎంతో భేషుగ్గా ఉందని ప్రస్తుతం తెలుగు ఫిలింనగర్, కృష్ణానగర్ కార్మికులు ముచ్చటించుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ నిర్ణయం సముచితమైనదని అంతా భావిస్తున్నారు. ఇండస్ట్రీని నమ్ముకుని జూనియర్ ఆర్టిస్టులు, డ్రామా ఇతర రంగం నుంచి వచ్చిన కళాకారులు ఉన్నారు. వారికి ఇది మేలు కలిగిస్తుంది. ప్రతి సినిమా టిక్కెట్టుపై 2 శాతం రుసుమును వసూలు చేసి సినీరంగంలోని కార్మికులు, పేద కళాకారుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే అది వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని కర్నాటక ప్రభుత్వం ఆలోచించింది. పరిశ్రమలో అసంఘటితంగా వదిలి వేసిన లేదా విసిరివేయబడిన కార్మికులను ఆదుకునే అద్భుత తరుణోపాయం అవుతుందని తెలుగు సినీరంగానికి చెందిన ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు.
అయితే ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఎవరు? అన్న చర్చా విస్త్రతంగా సాగుతోంది. యథావిధిగా ఈ నిర్ణయం వల్ల ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) 2శాతాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేరు. అలాగే ఓటీటీ సంస్థలకు కూడా ఇది ఇబ్బందికర పరిణామం అన్న చర్చా వేడెక్కిస్తోంది. పేద కళాకారులు, కార్మికుల కోసం ఎవరూ ఏదీ విదిల్చేందుకు సిద్ధంగా లేరు. రుసుము కేవలం 2 శాతమే అయినా కానీ.. ఆ మేరకు వీక్షకులకు ఖర్చు పెంచుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇది ఇప్పటికే కష్టాల్లో ఉన్న సినిమా థియేటర్లను మరింత కష్టంలోకి నెడుతుందని, ఓటీటీలకు ఇది లాభదాయకం కాదని ఒక సెక్షన్ భావిస్తోంది.
కర్నాటకలో తీసుకున్న నిర్ణయాన్ని ఇకపై టాలీవుడ్, కోలీవుడ్ సహా బాలీవుడ్ లోను అమలు చేసేందుకు ఆస్కారం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలోను ప్రభుత్వాల్లో ఆలోచనను పెంచే నిర్ణయమిదని కూడా ఊహిస్తున్నారు. 2 శాతం టికెట్ పై రుసుము అంటే పరిశ్రమ యేటేటా 50కోట్ల వరకూ కార్మికులకు, పేద కళాకారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మానసిక సంసిద్ధత అవసరం అవుతుంది. ఒక సినిమా 200 కోట్ల నుంచి 1000 కోట్లు వసూలు చేస్తుంది. చిన్న సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. అదే సమయంలో స్టార్ హీరోలే కాకుండా మామూలు హీరోలు కూడా కోట్లు వసూలు చేస్తున్నారు. కానీ కార్మికులైన చిన్న కళాకారులను పట్టించుకునే పాపాన పోలేదు. అందుకే ప్రస్తుతం కర్నాటక అమలు చేసిన బిల్లుపై ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలనలో ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో థియేటర్ యజమానులు, డిజిటల్ రంగంలోని వ్యక్తులు ఆందోళనలో ఉన్నారని కూడా ఆర్టిస్టుల సంఘానికి చెందిన ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు.