Begin typing your search above and press return to search.

ఇలాంటి సినిమాని ఏ హీరో అయినా వదులుకుంటాడా?

ఇటీవల కాలంలో ఏకగ్రీవంగా అందరు ఫిలిం క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకున్న సినిమా ఇదేనని చెప్పాలి.

By:  Tupaki Desk   |   8 Oct 2024 2:28 PM GMT
ఇలాంటి సినిమాని ఏ హీరో అయినా వదులుకుంటాడా?
X

తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "సత్యం సుందరం". ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కార్తీ అన్న హీరో సూర్య తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలు కూడా అలాగే వచ్చాయి. ఇటీవల కాలంలో ఏకగ్రీవంగా అందరు ఫిలిం క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకున్న సినిమా ఇదేనని చెప్పాలి.

నిజానికి 'సత్యం సుందరం' అనేది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు చాలా దూరంగా జరిగి తీసిన సినిమా. సున్నితమైన సింపుల్ కథతో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో తెరకెక్కించిన చిత్రమిది. 96 చిత్రంలో సున్నితమైన ప్రేమకథను ఎంతో హృద్యంగా చూపించిన దర్శకుడు.. ఈసారి మానవ సంబంధాలతో కూడిన ఎమోషనల్ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఎలాంటి ట్విస్టులు లేవు. ఫైట్స్, హీరోహీరోయిన్ల డ్యూయెట్స్, రొమాంటిక్ సన్నివేశాలు అసలకే లేవు. అయినా సరే ప్రేక్షకులు థియేటర్లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే.. ఇది ఎలాంటి కంటెంట్ ఉన్న చిత్రమో అర్థం చేసుకోవచ్చు.

బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తీ.. తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి 'సత్యం సుందరం' లాంటి సినిమా చేయడం సాహసమనే చెప్పాలి. ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించడానికి గల కారణాలను రీసెంట్ గా కార్తీ వివరించారు. "బాలచందర్, కె. విశ్వనాథ్, మహేంద్రన్, బాలు మహేంద్ర, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు రిలేషన్ షిప్స్ గురించి ఎన్నో సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో ఆ టైపు సినిమాలు రావడం లేదు. ఇప్పుడు డైరెక్టర్ ప్రేమ్‌ కుమార్ అలాంటి కథతోనే వచ్చారు. మరి ఇలాంటి సినిమాను నేను ఎలా వదులుకుంటాను?" అని కార్తీ అన్నారు.

'సత్యం సుందరం' కథేంటంటే.. సత్యం(అరవింద్ స్వామి)కి తన ఊరన్నా, అక్కడున్న తమ తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం. కొందరు దగ్గరి బంధువులు చేసిన మోసం వల్ల యుక్తవయసులోనే ఆ ఇంటిని కోల్పోయిన సత్యం కుటుంబం.. ఆ ఊరు వదిలేసి సిటీకి వచ్చి స్థిరపడతారు. ఊరికి పూర్తిగా దూరమైన సత్యం.. తనకెంతో ఇష్టమైన చెల్లెలి పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ముప్పై ఏళ్ల తర్వాత తన సొంతూరికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో అతడికి సుందరం(కార్తి)తో పరిచయం అవుతుంది. అతనితో సాగే ప్రయాణంలో సత్యం ఎదుర్కొన్న అనుభవాలేంటి? అతని పరిచయంతో సత్యం జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ.

'సత్యం సుందరం' సినిమాలో కార్తీ, అరవింద స్వామిలతో పాటుగా రాజ్‌ కిరణ్, శ్రీ దివ్య, దేవదర్శిని కూడా నటించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య - జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. తమిళంలో ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. కానీ తెలుగులో ‘దేవర’ నుంచి పోటీ ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా సెప్టెంబర్ 28న ధియేటర్లలోకి తీసుకొచ్చారు. తెలుగులో ఏషియన్ సురేష్ సంస్థ ఈ సినిమాని విడుదల చేసింది.