యుగానికి ఒక్కడు అన్‌కట్ వెర్షన్ లో ఉన్న కంటెంట్ అదే!
యుగానికి ఒక్కడు షూటింగ్ 2007లో మొదలైంది. కానీ సినిమా మాత్రం 2010 జనవరిలో రిలీజైంది. అంటే షూటింగే దాదాపు మూడేళ్ల పాటూ జరిగింది.
By: Tupaki Desk | 14 March 2025 5:00 AM ISTకార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకున్న తమిళ సినిమాల్లో ఇది కూడా ఒకటి. 2010లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కార్తీకి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడటానికి ఈ సినిమా మెయిన్ రీజన్. రిలీజైన పదిహేనేళ్లకు ఈ సినిమాను మార్చి 14న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి.
యుగానికి ఒక్కడు షూటింగ్ 2007లో మొదలైంది. కానీ సినిమా మాత్రం 2010 జనవరిలో రిలీజైంది. అంటే షూటింగే దాదాపు మూడేళ్ల పాటూ జరిగింది. ఈ సినిమా కోసమని రీమాసేన్, ఆండ్రియా డేట్స్ ను కేవలం నెలన్నర నుంచి రెండు నెలలే అడగారట. కానీ దాన్ని తర్వాత మూడేళ్ల పాటూ పెంచుకుంటూ వెళ్లారట. 260 రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న యుగానికి ఒక్కడు సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు సుమారు 7 నెలలు టైమ్ పట్టింది.
ఎడిటింగ్ టేబుల్ పై వచ్చిన రన్ టైమ్ 3 గంటల 1 నిమిషంతో సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా రిలీజ్ చేసిన డైరెక్టర్ సెల్వ రాఘవన్, సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో దాన్ని ఎడిట్ చేసి 2 గంటల 34 నిమిషాలకు కుదిరించారు. తమిళంలో సంక్రాంతి టైమ్ కు రిలీజైన ఈ సినిమా, తెలుగులో మాత్రం నెల లేటుగా ఫిబ్రవరిలో రిలీజై మొదటి రోజు నుంచే మంచి టాక్ ను తెచ్చుకుంది.
కరోనా తర్వాత ఈ సినిమాకు తమిళంలో అన్‌కట్ వెర్షన్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్‌కట్ వెర్షన్ లో చోళ రాజు, అనిత మధ్య ఓ సాంగ్, ఫైట్ సీన్ తో పాటూ ఇంట్రెస్టింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలోని సెకండాఫ్ లో వచ్చే గుహ సీన్స్ ను 90 రోజుల పాటూ షూట్ చేశారట. అందులో 2 వేల మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారట.
ఈ సినిమాకు జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎం చూసి ఆయనకు గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ సినిమా ఛాన్స్ వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందులో ధనుష్ హీరోగా నటిస్తాడని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆ సీక్వెల్ వస్తే అందులో రాజగురువుగా కార్తీ కనిపిస్తే చోళ యువరాజుగా ధనుష్ కనిపిస్తాడేమో చూడాలి.