అసలు కంటే కొసరు బాగుందే!
సినిమాటోగ్రాఫర్‌గా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించి 28 ఏళ్ల చిన్న వయసులోనే ‘సూర్య వెర్సస్ సూర్య’ మూవీతో దర్శకుడిగా మారాడు కార్తీక్ ఘట్టమనేని
By: Tupaki Desk | 18 April 2024 3:30 PM GMTసినిమాటోగ్రాఫర్‌గా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించి 28 ఏళ్ల చిన్న వయసులోనే ‘సూర్య వెర్సస్ సూర్య’ మూవీతో దర్శకుడిగా మారాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా ఓ మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకుంది కానీ.. కమర్షియల్‌గా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత ఎప్పట్లాగే సినిమాటోగ్రఫీలో బిజీ అయిపోయాడు కార్తీక్. మళ్లీ తొమ్మిదేళ్లకు అతడి దర్శకత్వంలో మరో సినిమా వచ్చింది. అదే.. ఈగల్. దర్శకుడిగా రెండో సినిమాకు సెటప్ మొత్తం మార్చేశాడు. రవితేజ లాంటి పెద్ద స్టార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బేనర్.. భారీ బడ్జెట్.. ఇలా ‘ఈగల్’ రేంజే వేరుగా కనిపించింది. ఈ సినిమాతో అతను బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయం అన్న అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఈగల్’ ప్రోమోలు అంత భారీగా, ఆకర్షణీయంగా కనిపించాయి. కానీ ఈ సినిమాలో హడావుడి తప్ప విషయం లేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
‘ఈగల్’ చేస్తున్న సమయంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు కార్తీక్‌కు దర్శకుడిగా ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్ పాత్రలో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు కార్తీక్. ఐతే ‘ఈగల్’ అనేది పెద్ద సినిమా అయితే.. తేజతో చేస్తోంది ఏదో చిన్న సినిమా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా మొదలయ్యే టైంకి తేజకు అంతగా గుర్తింపు లేదు. అప్పటికి ‘హనుమాన్’ రిలీజే కాలేదు. దీంతో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమా గురించి వార్తలు బయటికి వచ్చినపుడు ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు. అందరి ఫోకస్ కార్తీక్.. రవితేజతో చేస్తున్న ‘ఈగల్’ మీదే నిలిచింది. తీరా చూస్తే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఈలోపు ‘హనుమాన్’ రిలీజై బ్లాక్‌బస్టర్ కావడం, తేజ రేంజ్ మారిపోవడం జరిగాయి. ఇప్పుడు తేజతో కార్తీక్ తీస్తున్న ‘మిరాయ్’ ఫస్ట్ టీజర్ చూస్తే ఈ సినిమా రేంజే వేరుగా కనిపిస్తోంది. ‘హనుమాన్’ తరహా విజువల్ వండర్ లాగే కనిపిస్తోందీ చిత్రం. పీపుల్స్ మీడియా వాళ్లు ఈ సినిమా మీద భారీ బడ్జెట్టే పెట్టినట్లున్నారు. మొత్తానికి అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు భారీ అంచనాలున్న ‘ఈగల్’ తుస్సుమనిపిస్తే.. ముందు ఎవ్వరూ పట్టించుకోని ‘మిరాయ్’ సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.