Begin typing your search above and press return to search.

బ్యాక్ బెంచీ హీరోకి స్నాత‌కోత్స‌వంలో డిగ్రీ ప‌ట్టా

డిగ్రీ పూర్త‌యిన‌ దశాబ్దం తర్వాత కార్తీక్ ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి తన అల్మా మేటర్‌తో ఉత్సాహంగా క‌నిపించాడు.

By:  Tupaki Desk   |   12 Jan 2025 11:30 AM GMT
బ్యాక్ బెంచీ హీరోకి స్నాత‌కోత్స‌వంలో డిగ్రీ ప‌ట్టా
X

యువ‌నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల ముంబైలోని డి.వై పాటిల్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో తన డిగ్రీ ప‌ట్టా గౌర‌వాన్ని అందుకున్నారు. డిగ్రీ పూర్త‌యిన‌ దశాబ్దం తర్వాత కార్తీక్ ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి తన అల్మా మేటర్‌తో ఉత్సాహంగా క‌నిపించాడు. అతడు తాజాగా త‌న‌ ఇన్‌స్టాలో డిగ్రీ అందుకున్న‌ప్ప‌టి చిరస్మరణీయ జ్ఞాప‌కాల‌ను షేర్ చేసారు. విద్యార్థులు, అధ్యాపకులతో ఇవి అంద‌మైన మ‌ర‌పురాని జ్ఞాప‌కాలు అని కార్తీక్ ఈ ఆనంద క్ష‌ణంలో పేర్కొన్నారు.

ఆస‌క్తిక‌రంగా డిగ్రీ అందుకున్న కార్తీక్ ఎమోష‌న‌ల్‌గా స్పందించాడు. ``బ్యాక్‌బెంచీ విద్యార్థిగా ఉండటం నుండి స్నాతకోత్సవం కోసం వేదికపై నిలబడటం వరకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం`` అని కార్తీక్ తన వీడియోకు శీర్షిక పెట్టాడు. డివై పాటిల్ విశ్వవిద్యాలయం నాకు జ్ఞాపకాలు, కలలను ఇచ్చింది. ఇప్పుడు ఒక దశాబ్ధం త‌ర్వాత నా డిగ్రీని ఇచ్చారు! విజయ్ పాటిల్ సర్.. అద్భుతమైన ఉపాధ్యాయులు, ఈ ప్రేమకు, కలలు కనే వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు నిజంగా ఇంటికి వచ్చినట్లు అనిపించింది`` అని ఉద్వేగంగా స్పందించాడు.

`కార్తీక్` పేరును ప్రింట్ చేసిన‌ కళాశాల జెర్సీ జాకెట్ ని అత‌డికి అందించ‌గా, దానిని ధరించి వేదిక వ‌ద్ద అభిమాన విద్యార్థుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు కార్తీక్. ఆస‌క్తిక‌రంగా కార్తీక్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ `భూల్ భూలైయా 3` నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ కి విద్యార్థులు వేదిక‌పై ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌గా, కార్తీక్ కూడా వారితో జ‌త‌క‌లిసాడు. డ్యాన్సుల‌తో వేదిక హోరెత్తింది. కాలేజ్ విద్యార్థులంతా త‌మ ఫేవ‌రెట్ కార్తీక్ ఆర్య‌న్ తో సెల్ఫీలు, ఫోటోల కోసం ఉత్సాహం క‌న‌బ‌రిచారు. కార్తీక్ కి త‌న జీవితంలో ఇవి అద్భుత‌మైన ఉద్విగ్న క్ష‌ణాలు. అత‌డిని చ‌ప్ప‌ట్లు కేరింత‌ల‌తో విద్యార్థులంతా ఆహ్వానించారు. వారి ప్రేమ‌కు అత‌డు ఫిదా అయ్యాడు. అత‌డు క్యాంప‌స్ లో తన మాజీ ప్రొఫెసర్లతో గౌర‌వార్థ‌కంగా క‌ర‌చాల‌నం చేయ‌డం క‌నిపించింది. వేదిక‌పై అత‌డు విశ్వవిద్యాలయంలో గడిపిన రోజులను కూడా కార్తీక్ ఆర్య‌న్ గుర్తుచేసుకున్నాడు.

ఈ కార్యక్రమం వీడియో ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా దూసుకెళుతోంది. కార్తీక్ కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే.. ఈ నెల ప్రారంభంలో అత‌డు కొత్త‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌లో `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.