Begin typing your search above and press return to search.

హిందీ హీరోతో పార్టీలో శ్రీ‌లీల‌.. డేటింగ్ అంటూ ప్ర‌చారం!

టాలీవుడ్ ఇమేజ్ పెర‌గ‌డంతో ఇప్పుడు తెలుగు స్టార్ల‌కు హిందీ సినీప‌రిశ్ర‌మ‌లోను గొప్ప గౌర‌వం, గుర్తింపు ద‌క్కుతోంది.

By:  Tupaki Desk   |   4 March 2025 4:55 PM IST
హిందీ హీరోతో పార్టీలో శ్రీ‌లీల‌.. డేటింగ్ అంటూ ప్ర‌చారం!
X

టాలీవుడ్ ఇమేజ్ పెర‌గ‌డంతో ఇప్పుడు తెలుగు స్టార్ల‌కు హిందీ సినీప‌రిశ్ర‌మ‌లోను గొప్ప గౌర‌వం, గుర్తింపు ద‌క్కుతోంది. తెలుగు స్టార్లు బాలీవుడ్ అగ్ర హీరోల‌ ఫ్యామిలీ ఈవెంట్ల‌లో క‌నిపిస్తున్నారు. వారితో స‌న్నిహితంగా స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. మ‌హేష్, చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు బాలీవుడ్ సెల‌బ్రిటీ ఈవెంట్ల‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారుతున్నారు. హిందీ ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. అంబానీలు మొద‌లుకుని బాలీవుడ్ అగ్ర తార‌ల ఫ్యామిలీ పార్టీల్లో సంద‌డి చేస్తున్నారు. తెలుగు స్టార్ల‌కు ఇది నిజంగా ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ను తెస్తోంది.

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌కు అలాంటి గౌర‌వం ద‌క్కింది. వ‌ర‌స విజ‌యాల‌తో స్పీడ్ మీదున్న హిందీ యువ‌హీరో కార్తీక్ ఆర్యన్ కుటుంబ వేడుకలో శ్రీ‌లీల ప్ర‌త్యేక అతిథిగా క‌నిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైర‌ల్ అవుతోంది. పార్టీలో కార్తీక్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలీల నృత్యం చేస్తూ క‌నిపించింది. ఈ నృత్యాన్ని కార్తీక్ ఆర్యన్ స్వ‌యంగా త‌న ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు. కార్తీక్ ఆర్యన్ సోదరి డాక్టర్ కృతికా తివారీ కోసం ఈ పార్టీని నిర్వహించగా పార్టీలో శ్రీ‌లీల ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

పార్టీలో పుష్ప 2: ది రూల్ చిత్రంలోని కిసిక్ పాటలోని పాపుల‌ర్ హుక్ స్టెప్‌ను శ్రీలీల ప్రదర్శించింది. ఈ వీడియోకు రెడ్డిట్‌లో విభిన్న స్పందనలు వచ్చాయి. ఈ జంట `ఆషికి 3`లో కలిసి నటిస్తున్నారు. అందుకే వారు కలిసి తిరగడం అంత వింతగా అనిపించదు... అని రాసారు. అంతేకాదు కార్తీక్ కి శ్రీలీల పాత పరిచయస్తురాలు లేదా స్నేహితురాలు అని నేను అనుకుంటున్నాను.. అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ``శ్రీ‌లీల ఒక డాక్ట‌ర్. అలాగే ఆమె కుటుబంలోను వైద్యులు ఉన్నార‌``ని ఒక‌రు అన్నారు. కార్తీక్- శ్రీ‌లీల జంట డేటింగ్ ప్రారంభించార‌ని కూడా గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. మొత్తానికి శ్రీ‌లీల ఆషిఖి 3 లాంటి క్రేజీ సినిమాలో న‌టిస్తుండ‌గా బాలీవుడ్ లో త‌న పేరు మార్మోగుతోంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాతో హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మ‌వుతుండ‌డం ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. ఈ సినిమాతో పాటు శ్రీలీల ప‌లువురు హిందీ యువ‌హీరోల స‌ర‌స‌నా అవ‌కాశాలు అందుకుంది. కార్తీక్ ఆర్య‌న్ ఫ్యామిలీ పార్టీలో శ్రీ‌లీల హంగామా గురించి రెడిట్ లో ప్ర‌స్తుతం డిబేట్ వేడెక్కిస్తోంది.