తెలుగువారిని తిట్టి.. తెలుగు రాష్ట్రంలో తలదాచుకోవటమా కస్తూరీ?
నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బాధ్యత మరిచి మాట్లాడటం ఈ మధ్యన కొందరు సెలబ్రిటీలకు ఒక అలవాటుగా మారింది
By: Tupaki Desk | 17 Nov 2024 3:54 AM GMTనోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బాధ్యత మరిచి మాట్లాడటం ఈ మధ్యన కొందరు సెలబ్రిటీలకు ఒక అలవాటుగా మారింది. ఒక జాతిని ఉద్దేశించి ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు.. అందులో నిజానిజాలతో ఉంటే ఫర్లేదు. అందుకు భిన్నంగా పుక్కిటి పురాణం మాదిరి.. ఊళ్లో రచ్చబండ దగ్గరి కబుర్లలో కూడా రాని అనుచిత వ్యాఖ్యలు సినీ నటి కస్తూరి నోటి నుంచి రావటం తెలిసిందే. తెలుగు జాతికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలపై చెన్నైలోని తెలుగు సంఘాల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయటం.. ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కనిపించకుండా పోయిన కస్తూరి హైదరాబాద్ లో దొరికేశారు. ఆమెను అరెస్టు చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు.. ఏ తెలుగోళ్లను నానా మాటలు అన్నదో.. అదే తెలుగోళ్లు ఉండే తెలుగు రాష్ట్రంలోకి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి తలదాచుకోవటం విశేషం. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగు వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయటంతో కేసులు నమోదు చేశారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు చెన్నైలోని ఆమె నివాసానికి వెళ్లగా.. అక్కడ ఆమె లేరు. ఇంటికి తాళం వేసి ఉంది.
ఈ నేపథ్యంలో ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ అయి ఉండటాన్ని చెన్నై ఎగ్మోర్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకోవటం కోసం చెన్నై పోలీసులు సీరియస్ గా గాలిస్తున్న నేపథ్యంలో.. సాంకేతికత సాయంతో అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఆమె హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో చెన్నై పోలీసులు భాగ్యనగరికి చేరుకున్నారు. ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలోని బీఆర్ సీ అపార్టుమెంట్ లో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకోవటానికి సైబరాబాద్ పోలీసుల సాయాన్ని తీసుకున్నారు చెన్నై పోలీసులు. తమకు అందిన సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ చెక్ చేసిన పోలీసులు.. శనివారం రాత్రి ఆమెను అరెస్టు చేసి చెన్నై తరలించారు. మరోవైపు ఆమె ముందస్తు బెయిల్ ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. తెలుగోళ్లను ఉద్దేశించి ముతక వ్యాఖ్యలు చేసిన కస్తూరి.. ఆ తర్వాత తానేమీ అనలేదని.. తప్పుగా అర్థమైతే తనను క్షమించాలని కోరుకున్న సంగతి తెలిసిందే. అంతా ఒక ఎత్తు అయితే.. ఏ తెలుగోళ్ల మీద నోరు పారేసుకుందో.. అదే తెలుగోళ్లు ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఒకదాంట్లో తలదాచుకోవటం మరో లెవల్ గా చెప్పక తప్పదు.