అభిమాని హత్య కేసు: పవిత్ర గౌడకు కస్తూరి శంకర్ మద్ధతు?
తాజాగా అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు మద్ధతుగా కస్తూరి శంకర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 18 Jun 2024 8:44 AM GMTరేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్‌తో పాటు అరెస్టయిన కన్నడ నటి పవిత్ర గౌడపై ట్రోల్స్ చేస్తున్న ట్రోలర్స్‌ని సినీ నటి కస్తూరి శంకర్ తనదైన శైలిలో విమర్శించారు. ఈ ఘటనలో పవిత్ర గౌడ తరపున సీనియర్ నటి వకాల్తా పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతీయుడు ఫేం కస్తూరి శంకర్ ఇటీవల తెలుగు బుల్లితెరపైనా నటిగా వెలుగులు విరజిమ్మిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో బుల్లితెర, వెండితెర అవకాశాల్ని అందుకుంటున్నారు కస్తూరి. అదే సమయంలో సోషల్ మీడియాల్లోను చాలా యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు మద్ధతుగా కస్తూరి శంకర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి పవిత్ర గౌడకు మద్ధతుగా మాట్లాడుతూ... పవిత్ర కేసులో స్వయంకృత న్యాయమూర్తులైన యూట్యూబ్ సోషల్ మీడియా ప్రతినిధుల వ్యవహార శైలిని ఖండించారు. పవిత్ర గౌడ దర్శన్ స్నేహితురాలని, అతని భాగస్వామి కాదని, ఆమె వ్యక్తిగత జీవితం తన సొంత వ్యవహారం అని పేర్కొంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి జనం సెలబ్రిటీలను తమ ఆస్తిగా భావించి రాజా హరిశ్చంద్రులంటూ తీర్పులు వెలువరిస్తున్నారని.. తమ ప్రాణాలను సైతం పట్టించుకోకుండా ఇతరులపై తీర్పు చెప్పేందుకు తహతహలాడుతున్నారని కస్తూరి వ్యాఖ్యానించారు.
''నేను హింసను క్షమించను, కానీ బాధితురాలు అమాయకురాలు కాదు.. అతడు ఆమెను వేధిస్తున్నాడు. ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడానికి అతడికి ఏ హక్కు ఉంది? దర్శన్ చేసింది తప్పు అని నేను అంగీకరిస్తున్నాను. కానీ కోర్టులు ఉన్నాయి. పోలీసులు ఉన్నారు. సెలబ్రిటీలను వేధించే హక్కు ప్రజలకు ఎవరు ఇచ్చారు? మీరే నిర్ణయించుకోండి... అని ఆవేశంగా కోట్ చేస్తూ వ్యాఖ్యానించారు కస్తూరి.
రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ హస్తం ఉన్నట్లు వెల్లడికావడంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని దర్శన్ సహాయకులు కిడ్నాప్ చేసి కామాక్షి పాళ్యలోని ఓ షెడ్డులో హత్య చేసి, మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడవేసారు. నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్ రేణుకా స్వామి ఫోన్‌ని సుమనహళ్లి బ్రిడ్జి దగ్గర కాలువలో పడేసిందా? అన్నదానిపైనా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశారు. రేణుకా స్వామి మృతిపై కర్నాటకలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దర్నన్‌కి కఠిన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హత్యలో అతడి ప్రమేయంపై సందేహాలు ఉన్నప్పటికీ, అతడి అభిమానులు ఇప్పటికీ మద్దతునిస్తూనే ఉన్నారు.