Begin typing your search above and press return to search.

పెద్ద డైరెక్టర్స్ తో పెట్టుకుంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   15 Aug 2024 1:30 AM GMT
పెద్ద డైరెక్టర్స్ తో పెట్టుకుంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ?
X

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలకి అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆదరణ ఉండేది. జెంటిల్మన్ సినిమా నుంచి రోబో మూవీ వరకు శంకర్ అపజయం లేకుండా వరుస సక్సెస్ లు అందుకున్నాడు. సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అనే ఇమేజ్ ని శంకర్ సొంతం చేసుకున్నారు. సోషల్ ఎలిమెంట్స్ ని కథావస్తువుగా తీసుకొని వాటిని తెరపై గ్రాండ్ గా ఆవిష్కరించడంలో శంకర్ సక్సెస్ అయ్యారు

అయితే ఆయన సినిమాలు సక్సెస్ అయినప్పుడు బడ్జెట్ ఎంత పెరిగినా ఆ విషయంలో ఎలాంటి గొడవలు రాలేవు. కానీ 2.ఓ అనంతరం ఆయన టైమ్ అస్సలు బాగుండడం లేదు. ఇటీవల విడుదలైన ‘ఇండియన్ 2’ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచడం తో పాటు భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందు నుండి పెద్దగా హైప్ లేకపోవడం, సినిమా బాగా ఆలస్యమవ్వడం, అలాగే ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, సినిమా మీద ఆసక్తి తగ్గిపోయింది.

ఇక సినిమా చూశాక ఈ చిత్రం, శంకర్ కెరీర్‌లోనే అట్టడుగు చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. సినిమా అన్ని భాషల్లో కలిపి వంద కోట్ల వసూళ్లను కూడా సాధించలేకపోయింది. ఇది చూసి నిర్మాతల పరిస్థితి పై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ‘ఇండియన్ 2’కి సంబంధించిన బడ్జెట్ అంశం కూడా పెద్ద చర్చకు దారితీసింది. మొదట 250 కోట్ల బడ్జెట్‌లో ఈ సినిమా తెరకెక్కిందని వార్తలు వచ్చినప్పటికీ, తరువాతి రోజుల్లో బడ్జెట్ మరింత పెరిగిందనే సమాచారం వెలుగులోకి వచ్చింది. ‘ఇండియన్ 2’తో పాటు ‘ఇండియన్ 3’ కూడా ఒకేసారి నిర్మించడం వల్ల ఈ భారీ బడ్జెట్ కేటాయించారని అందరూ భావించారు.

ఈ నేపథ్యంలో, సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘ఇండియన్’ సీక్వెల్స్ బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, సినిమా మొదలు పెట్టి పూర్తిచేయడానికి ఆరేళ్లు పట్టిందట. అంతేకాకుండా, మధ్యలో క్రేన్ ప్రమాదం జరగడంతో పాటు షూటింగ్ ఆగిపోవడం వల్ల బడ్జెట్ హద్దులు దాటిపోయాయని అన్నారు. ఈ పరిస్థితిని చూసి లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారట.

ముందుగా అనుకున్న బడ్జెట్ రూ.230 కోట్లు అయినా, అది సరిపోక మరింత వృద్ధి చేసి చివరకు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని ప్రసాద్ పేర్కొన్నారు. అయితే, శంకర్‌తో మొదట ఘర్షణ పరిస్థితి ఉన్నప్పటికీ, చివరికి సినిమా పూర్తిచేయడానికి ఆయనతో రాజీ కుదుర్చుకున్నారట. ప్రతి సారీ చెప్పిన బడ్జెట్ కంటే అధికంగా ఖర్చు పెరిగిందని, లైకా ప్రొడక్షన్స్ అనుభవించిన కష్టాలను ప్రసాద్ వెల్లడించారు. ఇక ఇండియన్ 3 ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే భయం కూడా ఉంది.

ఇండియన్ 2 రిజల్ట్ అనంతరం అసలు ఆ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ పరిస్థితి చూసి, సినిమా నిర్మాణంలో వ్యయ నియంత్రణ ఎంత ముఖ్యమో అన్న విషయం పై పరిశ్రమలో మళ్ళీ చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ పెట్టి, ఆర్థికంగా సేఫ్ అయ్యేలా సినిమాలను రూపొందించడంలో సృష్టికర్తలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.