వరుసగా నాలుగు ఫ్లాప్స్‌తో కనుమరుగైంది..!
తెలుగు ప్రేక్షకులకు 2018లో 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్.
By: Tupaki Desk | 14 March 2025 10:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు 2018లో 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి సినిమాల్లో, క్రేజీ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. మొదటి సినిమా ఈ మాయ పేరేమిటో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత తమిళ్‌లో ఒక సినిమాను చేసే అవకాశం దక్కింది. తెలుగులో 2021లో ఏక్ మినీ కథ సినిమాలో నటించడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు జనాల దృష్టిని ఆకర్షించడంలో కావ్య థాపర్ సక్సెస్ అయింది. అందుకే ఆమెకు వరుసగా సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.
హిందీలో మిడిల్ క్లాస్ లవ్ సినిమాలో నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో మళ్లీ సౌత్ సినిమాలపైనే ఈమె ఆసక్తి చూపించింది. తమిళ్‌లో ఈమె విజయ్ ఆంటోనీ సినిమా పిచ్చైకారన్ 2 సినిమాలో నటించింది. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. అయినా కూడా తమిళంలో ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కలేదు. పిచ్చైకారణ 2 తర్వాత తెలుగులో వరుసగా నాలుగు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. గత ఏడాది ఈమె నటించిన నాలుగు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలతో కావ్య థాపర్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు.
గత ఏడాది కావ్య థాపర్ నటించిన ఈగల్, ఊరు పేరు భైరవ కోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రవితేజతో ఈమె ఈగల్ సినిమాలో నటించి స్టార్‌డం దక్కించుకోవాలని ఆశ పడింది. కానీ ఈగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. కానీ ఎక్కడ కూడా మినిమం పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేక పోయింది. ఈగల్ తర్వాత ఈమె నటించిన ఊరు పేరు భైరవ కోన సినిమా విడుదల అయింది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈమె పాత్ర పరిధి పరిమితం కావడంతో ఈమెకు రావాల్సిన గుర్తింపు, ఆఫర్లు రాలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇంకా గత ఏడాదిలోనే కావ్య థాపర్ నటించిన డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాలు సైతం విడుదల అయ్యి నిరాశను మిగిల్చాయి. అందుకే కావ్య థాపర్ ఇప్పటి వరకు ఈ ఏడాదిలో కొత్త సినిమాను కమిట్ కాలేదు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే ఏడాది నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో సాదారణంగా ఏ హీరోయిన్ కూడా కోలుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఈ అమ్మడికి సైతం కొత్త ఆఫర్లు వెంటనే వచ్చే పరిస్థితి లేదు. ముందు ముందు చేయబోతున్న సినిమాలు అయినా జాగ్రత్తగా చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చేసిన నాలుగు సినిమాల్లో కనీసం రెండు హిట్ అయినా నేడు కావ్య టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ ఉండేది.