కీడా కోలా.. వ్యాపారం కోసం అలా చేస్తారా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరు వింటేనే ఆయన పాడిన ఎన్నో సూపర్ హిట్ పాటలు మనకు టక్కున గుర్తుకు వచ్చేస్తాయి.
By: Tupaki Desk | 16 Feb 2024 10:28 AM GMTఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరు వింటేనే ఆయన పాడిన ఎన్నో సూపర్ హిట్ పాటలు మనకు టక్కున గుర్తుకు వచ్చేస్తాయి. సంగీత ప్రపంచానికి రారాజు ఆయన. తన స్వరంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు. ఇప్పటికీ బాలు పాడిన పాటలను ఆయన అభిమానులకు ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా 16 భాషల్లో 40 వేల పాటలు ఆలపించారు బాలు.
ఒక రోజులో అత్యధిక పాటలు పాడిన సింగర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన సాధించారు. అయితే ఎస్పీ బాలు గొంతును ఏఐ సహాయంతో రీ క్రియేట్ చేయమని చాలా మంది అడుగుతున్నట్లు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్.. ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెహమాన్ కన్నా ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు బాలు వాయిస్ ను ఏఐ సహాయంతోనే రీ క్రియేట్ చేశారు. దీంతో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చైతన్య రావు, జీవన్, విష్ణు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. అయితే ఒక చిన్న కామెడీ సీక్వెన్స్ లో భాగంగా ఎస్పీ బాలు వాయిస్ ను ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. బాలు పాడిన ఓ సాంగ్ ను సినిమాలోని ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వాడారట. దాని కోసమే ఏఐ ద్వారా సాంగ్ రీ క్రియేట్ చేసినట్లు సమాచారం.
ఈ విషయం బాలు కుమారుడు చరణ్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన జనవరి 18వ తేదీన వివేక్ సాగర్ సహా కీడాకోలా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారట. అయితే ఆ మ్యాటర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి బాలు గొంతును చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారట చరణ్.
"దూరమైన మా తండ్రి వాయిస్ ను ఏఐ ద్వారా రీ క్రియేట్ చేయడం బాగుంది. చనిపోయినా ఆయన గొంతుకు జీవం పోసిన టెక్నాలజీని మేం స్వాగతిస్తున్నాం. కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా గొంతును రీ క్రియేట్ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదు. అందుకే ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్లాం" అని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూాడాలి.