Begin typing your search above and press return to search.

ఆయ‌నకు పాట రాయ‌డం అదృష్టంగా భావిస్తున్నా

సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతున్న ఆయ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవ‌డానికి ముందు ప్లే బ్యాక్ సింగ‌ర్ అవాల‌నుకున్నార‌ట‌.

By:  Tupaki Desk   |   26 March 2025 11:30 PM
Keeravani dream Illayaraja music
X

సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి సాధించిన ఘ‌న‌త‌ల గురించి చెప్పాలంటే మాటలు స‌రిపోవు. కేవ‌లం సంగీత ద‌ర్శ‌కుడిగా మాత్ర‌మే కాకుండా ఆయ‌న ఎన్నో సినిమాల‌కు పాట‌లు పాడారు. ఎన్నో పాట‌ల‌ను రాశారు కూడా. సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతున్న ఆయ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవ‌డానికి ముందు ప్లే బ్యాక్ సింగ‌ర్ అవాల‌నుకున్నార‌ట‌.

కీర‌వాణి అస‌లు మ‌ద్రాస్ వెళ్లింది కూడా ప్లే బ్యాక్ సింగ‌ర్ అవ‌డానికేన‌ట‌. కానీ అది క‌ష్ట‌మ‌ని తెలిసి, త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా సెటిలైపోయాడు. సంగీత ద‌ర్శ‌కుడయ్యాక ఆయ‌న ఎన్నో పాట‌లు పాడిన విష‌యం తెలిసిందే. అయితే అస‌లు కీర‌వాణికి ప్లే బ్యాక్ సింగ‌ర్ అవాల‌నే కోరిక పుట్టింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌యరాజా సంగీతం వ‌ల్లేన‌ట‌.

ఎలాగైనా ప్లే బ్యాక్ సింగ‌రై ఇళ‌య‌రాజా సంగీతంలో పాట పాడాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నార‌ట కీర‌వాణి. కానీ మొద‌ట్లో ఆ కోరిక తీర‌లేదు. త‌ర్వాత ఓ డ‌బ్బింగ్ సినిమా ద్వారా ఇళ‌య‌రాజా మ్యూజిక్ లో పాట పాడే కోరిక తీర్చుకున్న ఆయ‌న ఇప్పుడు ఇళ‌యారాజా సంగీతం అందిస్తున్న ట్యూన్ కు సాహిత్యం అందించారు.

రూపేష్ హీరోగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా ప‌వ‌న్ ప్ర‌భ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ష‌ష్టిపూర్తి. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌యరాజా సంగీతం అందిస్తుండ‌గా, అందులో ఏదో ఏ జ‌న్మ‌లోదో అనే సాంగ్ కు కీర‌వాణి సాహిత్యం అందించారు. గ‌తంలో ఎన్నో పాట‌ల‌కు సాహిత్యం అందించిన కీర‌వాణి ఆస్కార్ అందుకున్న త‌ర్వాత రాసిన మొద‌టి పాట ఇదే అవ‌డం విశేషం.

ఇళ‌యరాజా గారు సంగీతం అందిస్తున్న ట్యూన్ కు పాట రాసే అవ‌కాశాన్ని ఇచ్చిన రూపేష్ కు, ప‌వ‌న్ ప్ర‌భ‌కు థ్యాంక్స్ చెప్తూ, మ్యూజిక్ మ్యాస్ట్రో సంగీతం అందిస్తున్న సినిమాలో పాట రాయ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్టు కీర‌వాణి ఓ వీడియో ద్వారా తెలిపారు.