ఆస్కార్ విషయంలో రామోజీ అభిప్రాయం చెప్పిన కీరవాణి!
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుముసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2024 8:26 AM GMTరామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుముసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి.. రామోజీరావు గురించి స్పందించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... రామోజీరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన మరణం తెలుగు జాతికే కాదు యావత్ దేశానికీ తీరని లోటంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో ఎంఎం కీరవాణికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ట్రిపుల్ ఆర్ సినిమాలోని పాటకు ఆస్కార్ వచ్చినప్పటి వీడియో!
ఇందులో భాగంగా ఆస్కార్ అందుకున్న తర్వాత... ఆయన కోసమైనా తనకు అస్కార్ అవార్డ్ రావాలని కోరుకున్నట్లు ఆ వీడియోలో కీరవాణి వెల్లడించారు. అయితే... ఆస్కార్ అందుకోవడంపై ఆయన మాట్లాడుతూ... ఆస్కార్ అవార్డును అందుకునే విషయంలో తనకు ఏమీ పెద్దగా ఎగ్జయిట్మెంట్ లేదని.. వస్తే మంచిదనే సదుద్దేశంతోనే ఉనానని తెలిపారు.
జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తనకు ఆస్కార్ అవార్డ్ అనేది పెద్ద ఎగ్జయిట్మెంట్ ఇవ్వలేదని కూడా అప్పట్లో ఆయన అన్నారు. ఈ సందర్భంగా “ఆస్కార్ అవార్డు - రామోజీరావు అభిప్రాయం” అనే విషయాలపై తాజాగా కీరవాణి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి!
మనిషన్నవాడు బ్రతికితే ఒక్కరోజైనా రామోజీరావుల బ్రతకాలని తన భార్య అటుంటుందని.. అలాంటి రామోజీరావుని కలవడానికి తాను వెళ్లినపుడు ఆస్కార్ కి సంబంధించిన చర్చ జరిగిందని కీరవాణి అన్నారు. ఇందులో భాగంగా... "మీరూ ఆస్కార్ తీసుకురండి ఇంటికి" అని ఆయన అంటే తాను విని ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
రామోజీరావు అంతటివ్యక్తి ఆస్కారు ఇంత విలువ ఇస్తున్నారా? అంటే... కచ్చితంగా దానికి విలువ ఉందన్నమాట, అదెలాగైనా తీసుకురావాలి అని ఒక టెన్షన్ బయలుదేరిందని అన్నారు. చంద్రబోస్ చెప్పినట్లు ఆస్కార్ అవార్డు ప్రకటించడానికి 45 నిమిషాల ముందు.. ఎవరికోసం కాకపోయినా రామోజీరావు కోసం ఈ అవార్డు రావాలని కోరుకున్నాను.. వచ్చింది.. కీరవాణి తెలిపారు.