కీరవాణి సంచలనం: భీష్ముడిలా రామోజీ.. విముక్తిని కళ్లారా చూశారు
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు భారీగా షేర్ అవుతోంది.
By: Tupaki Desk | 28 Jun 2024 7:40 AM GMTమీడియా మొఘల్ రామోజీరావు సంస్మరణ సభను ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం తెలిసిందే. ఈ సభలో ఎంతో మంది ప్రముఖులు.. వక్తలు మాట్లాడారు. వారందరి మాటలు ఒక ఎత్తు అయితే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చేసిన సంక్షిప్త ప్రసంగం పెను సంచనలంగా మారింది. రామోజీరావుకు జగన్ కు మధ్యనున్న వైరం తెలుగు ప్రజలకు తెలియంది కాదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే అనారోగ్యంగా ఉన్న రామోజీ ప్రాణాలు విడిచిన వైనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు భారీగా షేర్ అవుతోంది.
రామోజీరావును భీష్ముడితో పోలిస్తూ.. ఆయన తన మరణాన్ని తాను కోరుకున్న మంచి ఘడియల్లో ప్రాణాలు విడవటం తెలిసిందే. అదే రీతిలో ఏపీని కబంధ హస్తాల నుంచి విముక్తి అయిన వైనాన్ని చూసిన తర్వాతే ప్రాణాలు వదిలారన్న కీరవాణి.. మరణం అంటే రామోజీరావు మరణంలా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తమ ఇంట్లో రామోజీరావుకు తామిచ్చే గౌరవ మర్యాదలు ఎంత ఉంటాయన్న విషయాన్ని చిన్న ఉదాహరణ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
కీరవాణి మాట్లాడిన మాటల్ని ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆపుకొన్నట్లు.. రామోజీరావు తానెంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. కబంధ హస్తాల్లోంచి బయటపడడం కళ్లారా చూసి నిష్క్రమించారు. బతికితే ఒక్క రోజైనా రామోజీరావులా బతకాలని గతంలో ఒక సభలో అన్నాను. ఇప్పుడు మరణించినా ఆయనలాగే మరణించాలని కోరుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.
తనకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చిన రామోజీరావుతో ఎన్నో మధుర క్షణాలు గడిపినందుకు తానెంతో గర్విస్తున్నట్లుగా పేర్కొన్నారు. ‘‘ఆ క్షణాల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి ఆయన వంతుగా నటులు.. ఉద్యమకారులు.. రచయితలు.. సంగీత దర్శకులు.. గాయనీ గాయకుల్ని పిలిచారు. పాటలు రికార్డు చేయించి.. ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నన్నూ ఒక పాట రికార్డు చేయమన్నారు. మద్రాసు వెళ్లి నాలుగు రకాల ట్యూన్ లు చేసి మీకు పంపుతాను సార్ అని అన్నాను. అప్పుడాయన కోసం చాలామంది బయట ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక్క ట్యూన్ చేసి పంపండి. దీనికి నేను మీకు రెమ్యునరేషన్ ఇవ్వటం లేదు. అభ్యర్థిస్తున్నాను.అభ్యర్థించేవాడికి ఆప్షన్లు ఉండవు. అలా చేయకూడదు. అది ధర్మం కాదు’’ అని తనతో అన్న మాటల్ని బయటపెట్టారు.
నిజానికి తనకు రామోజీరావు ఆ మాటల్ని చెప్పటానికి రెండు నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదన్న కీరవాణి.. ఆయనపై బురద జల్లాలని ప్రయత్నించటం నడినెత్తిన ఉన్నస్యూరుడి మీద రాయి విసరటం లాంటిదన్నారు. అంతేకాదు.. రామోజీరావుకు తమ ఇంట్లో ఇచ్చే ప్రాధాన్యత గురించి చెబుతూ.. ‘‘ఆయన ఫోటో మా ఇంటి పూజమందిరంలో ఉంటుంది. ఆయన దేవుడ్ని నమ్మరు. దేవుడ్ని నమ్మని రామోజీరావు ఫోటో మా ఇంట్లో దేవుడు ఉండే చోట ఉంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రామోజీ స్ఫూర్తి.. నా మనసులో చిరకాలం ఉంటుంది’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. నిజాన్ని ఇంత ఓపెన్ గా చెప్పటం మామూలు విషయం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.