Begin typing your search above and press return to search.

బర్త్ డే బ్యూటీ.. మూడు భాషల్లోనూ మొదట అట్టర్‌ ఫ్లాప్‌

నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు షేర్ చేసుకుంటూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 12:30 PM GMT
బర్త్ డే బ్యూటీ.. మూడు భాషల్లోనూ మొదట అట్టర్‌ ఫ్లాప్‌
X

నటుడు సురేష్ కుమార్‌, నటి మేనక వారసురాలు అయిన కీర్తి సురేష్ టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా ఈమె చేసిన మహానటి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వల్ల పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నటిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉన్న కీర్తి సురేష్‌ కెరీర్ ఆరంభంలో మాత్రం తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంది.

నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయాలు పక్కన పెడితే కెరీర్‌ ఆరంభంలో కీర్తి సురేష్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్‌ తల్లితండ్రి ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే అవ్వడంతో బాల నటిగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించింది. మలయాళంలో కీర్తి సురేష్ మొదటి సినిమా చేసింది. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో హీరోయిన్‌గా మొదటి ఫ్లాప్‌ ను కీర్తి సురేష్ మూట కట్టుకుంది.

మోహన్‌లాల్‌ సినిమాలో నటించడానికి ముందు రెండు మూడు సినిమాలు ప్రారంభం అయి కొన్నాళ్ల షూటింగ్ తర్వాత ఆగిపోయాయి. దాంతో కీర్తి సురేష్ ను ఐరెన్‌ లెగ్‌ అంటూ కొందరు విమర్శించడం మొదలు అయింది. అదే సమయంలో తమిళంలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాతో తమిళ ప్రేక్షకులు కీర్తి సురేష్ ను హీరోయిన్‌గా అంగీకరించలేదు. ఆ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్‌ అయింది. దాంతో ఐరెన్‌ లెగ్ ముద్ర మరింతగా పడి పోయింది. దాంతో కీర్తి సురేష్ టాలీవుడ్‌ లో సినిమా ప్రయత్నం చేసింది. తెలుగు లో కీర్తి సురేష్ రెండు జళ్ల సీత లో నటించింది. ఆ సినిమా సైతం వాయిదా పడుతూనే వచ్చింది. ఆ సినిమా విడుదల కాకపోవడంతో కీర్తి సురేష్ కి మూడు ఇండస్ట్రీలోనూ నిరాశే మిగిలింది.

అసలు ముందు ముందు అయినా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నిలదొక్కుకునే అవకాశం ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్‌ గా పనికి రాదని, ఆమెను ఐరెన్‌ లెగ్‌ అంటూ విమర్శించిన వారే మహానటి సినిమాతో అభిమానులు అయ్యారు. అంతకు ముందు ఆ తర్వాత సైతం కీర్తి సురేష్ నుంచి మంచి సినిమాలు వచ్చాయి. జాతీయ అవార్డ్‌ స్థాయి నటి కీర్తి సురేష్ అంటూ ఇప్పుడు ప్రశంసలు దక్కించుకుంటుంది. అందుకే కీర్తి సురేష్‌ పేరుకు తగ్గట్లుగా కీర్తిని దక్కించుకుని పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకు పోతుంది. ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్‌ హీరోయిన్‌ గా అనిపించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు బెస్ట్‌ హీరోయిన్‌ గా ప్రశంసలు దక్కించుకుంటుంది. ముందు ముందు మరిన్ని హిట్స్ కీర్తి సురేష్ కి దక్కాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్‌ డే టు కీర్తి సురేష్‌.