స్నేహితుడిని పెళ్లాడే ముందు చీరలో సింగారం
తాజాగా కీర్తి నీలి రంగు డిజైనర్ శారీలో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోగ్రాఫ్ లో దేవతాసుందరిని తలపిస్తోంది. పెళ్లికి ముందు కీర్తి మూడ్ ని ఇది ఎలివేట్ చేస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
By: Tupaki Desk | 1 Dec 2024 7:04 AM GMTజాతీయ అవార్డు గ్రహీత, యువనటి కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు గుసగుసలే నిజమయ్యాయి. తన స్నేహితుడు అయిన దుబాయ్ బిజినెస్ మేన్ ఆంటోనిని కీర్తి పెళ్లాడేయబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాల్లో ధృవీకరించింది. మీడియా ఊహాగానాలకు చెక్ పెడుతూ ఈ అధికారిక ప్రకటన అనంతరం కీర్తి శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించడానికి తిరుపతికి వెళ్లింది.
కీర్తితో పాటు తన తల్లి మేనక, తండ్రి జి. సురేష్‌కుమార్ కూడా తిరుమలేశుని చెంత మొక్కు తీర్చుకోవడానికి విచ్చేశారు. ఈ డిసెంబర్ లోనే కీర్తి- ఆంటోని పెళ్లి జరగనుంది. అంతకంటే ముందే తన బాలీవుడ్ అరంగేట్రం కోసం ఆశీర్వాదం కోసం అక్కడకు వచ్చినట్లు కీర్తి తిరుమలలో విలేకరులకు తెలియజేసింది.
కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని పెళ్లి చేసుకోవడం అధికారికం. ఆ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారని కథనాలొచ్చాయి. సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కూడా కీర్తి తన ప్రేమను కొనసాగించింది. 15 ఏళ్లుగా పరిచయం ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ``వచ్చే నెలలో నాకు పెళ్లి, నా హిందీ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.. అందుకే దేవుడి ఆశీస్సులు పొందేందుకు వచ్చాను. డిసెంబర్‌లో గోవాలో పెళ్లి జరగనుంద``ని కీర్తి ధృవీకరించింది.
డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో కీర్తి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి ముందు కీర్తి ఫోటోషూట్లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల కీర్తి కొన్ని బోల్డ్ ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. దానికి భిన్నంగా కీర్తి ట్రెడిషనల్ శారీ లుక్ లను కూడా ఇప్పుడు షేర్ చేస్తోంది. తాజాగా కీర్తి నీలి రంగు డిజైనర్ శారీలో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోగ్రాఫ్ లో దేవతాసుందరిని తలపిస్తోంది. పెళ్లికి ముందు కీర్తి మూడ్ ని ఇది ఎలివేట్ చేస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... కీర్తి సురేష్ త్వరలో `బేబీ జాన్`లో కనిపించనుంది. ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక గబ్బి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. మహానటి, దసరా, భోళా శంకర్ సహా పలు విజయవంతమైన చిత్రాల్లో కీర్తి నటించిన సంగతి తెలిసిందే.