Begin typing your search above and press return to search.

మహానటి బ్రేక్‌... అసలు విషయం ఇదేనా?

కీర్తి సురేష్‌కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   20 Dec 2024 7:30 AM GMT
మహానటి బ్రేక్‌... అసలు విషయం ఇదేనా?
X

మహానటి ఫేం కీర్తి సురేష్‌ తాజాగా తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు ఆంటోనిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. వీరిద్దరి మధ్య ప్రేమ 15 ఏళ్లుగా కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయి. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంను కొందరు తప్పుబడుతూ ఉంటే, కొందరు మాత్రం గత కొంత కాలంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. కనుక పెళ్లి అనేది కీర్తి సురేష్‌కి అడ్డు కాకపోవచ్చు అన్నారు. కీర్తి సురేష్ సైతం పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత బాలీవుడ్‌లో సినిమాను చేయడం మాత్రమే కాకుండా, అందులో మునుపెన్నడూ లేనంతగా స్కిన్‌ షో చేసింది.

ముందు ముందు ఆమె నుంచి మరింతగా అందాల ఆరబోత చూడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో కీర్తి సురేష్ కొత్త సినిమాల గురించి చర్చ జరుగుతోంది. ఇటీవలే బేబీ జాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బాలీవుడ్‌ నుంచి ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. కానీ ప్రస్తుతానికి వచ్చిన ఆఫర్లను ఈమె సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది. పెళ్లి తర్వాత వరుసగా సినిమాలు చేయాలి అనుకున్న కీర్తి సురేష్‌ కాస్త గ్యాప్‌ ఇచ్చి ఆ సినిమాలను మొదలు పెట్టాలని భావిస్తుందట. అందుకే వచ్చిన ఆఫర్లను ఆమె సున్నితంగా వెనక్కి పంపించిందని తెలుస్తోంది.

కీర్తి సురేష్‌కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా పెళ్లి తర్వాత మినిమం గ్యాప్‌ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమె నో చెబుతోంది. ప్రస్తుతం ఆమె కమిట్ అయిన రెండు మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తి అయిన తర్వాత కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ సినిమాల గురించి తమిళ్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి.

తెలుగులో నేను శైలజ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్ ఆ తర్వాత చేసిన పలు సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా పలువురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసినా కీర్తి సురేష్‌ తెలుగు కమర్షియల్‌ సినిమాలకు సెట్‌ అవ్వదేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలే ఆమె చేస్తే బాగుంటుందని అన్నారు. కానీ హిందీ, తమిళ్‌ లో మాత్రం ఆమె కమర్షియల్‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. త్వరలోనూ ఆమె నుంచి మరిన్ని కమర్షియల్‌ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఆమె నటించడం చాలా అరుదుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.