కేజీఎఫ్ × సలార్.. ఈ లింకు మంచిదేనా
భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న సలార్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 2 Dec 2023 3:46 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న సలార్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సినిమా కోసం వేయి కళ్ళతోతో ఎదురుచూస్తున్నారు.
ఇక ట్రైలర్ వస్తే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎక్కువ టికెట్స్ తెగుతాయని అందరూ అంచనా వేశారు. తాజాగా సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. గతంలో సలార్ టీజర్ ని కేవలం ఇంగ్లీష్ డైలాగ్స్ తో కట్ చేసి ఒక్కసారిగా హైప్ క్రియ్హేట్ చేశారు. అందులో ప్రభాస్ పాత్రని డైనోసార్ తో పోల్చాడు. సలార్ ట్రైలర్ లో మాత్రం ప్రశాంత్ నీల్ కాస్తా ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
స్నేహితుడు కోసం ప్రాణాలు ఇవ్వడానికి లేదంటే ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యే దేవా అనే పాత్రలో ప్రభాస్ సలార్ లో కనిపించాడు. ఖాన్ షార్ అనే ఒక బందిపోటు రాజ్యం. అందులో కుర్చీ కోసం జరిగే కుతంత్రాలు జరగడం రాజ మున్నార్ వారసుడు వరదరాజ మున్నార్ ని అంతం చేయాలని అందరూ కుట్రలు చేయడం వరదరాజ మున్నార్ తన స్నేహితుడుని సైన్యంగా తెచ్చుకోవడం.
ఒక్కడు వందలాది మంది సైన్యాన్ని నాశనం చేసి వరదరాజ మున్నార్ కి రక్షణగా ఉండటం లాంటి ఎలిమెంట్స్ ట్రైలర్ లో ఉన్నాయి. క్యాజువల్ గా చూస్తే ట్రైలర్ లో చూపించిన ప్రతి అంశం ఇప్పటికే మనం చాలా సినిమాలలో చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. కాని సలార్ సినిమా ప్రశాంత్ నీల్ నుంచి వస్తోంది. అందుకే ఈ ట్రైలర్ కి పవర్ వచ్చింది. గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది.
అయితే ట్రైలర్ చూస్తున్నంత సేపు స్టొరీ నేరేషన్ నుంచి విజువల్స్, క్యారెక్టర్స్ అన్ని కూడా కేజీఎఫ్ కి చాలా సిమిలారిటీస్ సలార్ లో కనిపిస్తున్నాయి. బ్లాక్ బ్యాగ్రౌండ్, మాఫియా రాజ్యంలోకి సైన్యం రావడం. కేజీఎఫ్ సామ్రాజ్యం తరహాలోనే కింగ్ షార్ రాజ్యం. అక్కడ ఆధిపత్యపోరు. హీరో చిన్నప్పటి పాత్ర బిల్డప్, ఈశ్వరీరావు పాత్ర అన్ని కూడా కేజీఎఫ్ సిరీస్ కి చాయల్లోనే సలార్ ని ప్రశాంత్ నీల్ ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ కి అన్ని భాషలలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కాని అంతకు మించి ఆలోచిస్తే కేజీఎఫ్ తో ఉన్న సిమిలారిటీస్ సలార్ కి పాజిటివ్ అవుతాయా, నెగిటివ్ అవుతాయా అనేది అప్పుడే చెప్పలేం.