ఫ్యాన్స్ గుండెల్లో శాశ్వత 'ఖైదీ' అయ్యి 40 ఏళ్లు..!
చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన సినిమా, తెలుగు ప్రేక్షకులకే కాకుండా మొత్తం దేశం మొత్తానికి కూడా పరిచయం చేసిన సినిమా 'ఖైదీ'.
By: Tupaki Desk | 28 Oct 2023 9:35 AM GMTచిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన సినిమా, తెలుగు ప్రేక్షకులకే కాకుండా మొత్తం దేశం మొత్తానికి కూడా పరిచయం చేసిన సినిమా 'ఖైదీ'. 1983 లో విడుదలైన ఖైదీ సినిమా గురించి ఇంకా కూడా మాట్లాడుకుంటున్నాము అంటే అప్పట్లో ఆ సినిమా సాధించిన విజయం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా కొన్ని ఖైదీ రికార్డులు బ్రేక్ కాలేదు అనడంలో సందేహం లేదు.
సంయుక్త మూవీస్ బ్యానర్ లో ఎమ్ తిరుపతి రెడ్డి, ధనుంజయరెడ్డి, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచన సహకారం అందించారు. చిరంజీవికి జోడీగా మాధవి ఈ సినిమాలో నటించింది. 157 నిమిషాల నిడివి తో వచ్చిన ఈ సినిమాకి చక్రవర్తి అందించిన సంగీతం కూడా గొప్ప బలంగా నిలిచింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతకు ముందు ఎన్నో రివేంజ్ డ్రామాలు వచ్చాయి. కానీ ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ దర్శకుడు కోదండ రామిరెడ్డి ప్రయోగం చేశాడు అంటూ అప్పట్లో సినీ విశ్లేషకులు మాట్లాడుకున్నారు. ఇప్పటికి కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలి అనుకునే వారు ఖైదీ సినిమాను చూడాల్సిందే.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం చిరంజీవి ఖైదీ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. అలాంటి ఖైదీ సినిమా విడుదల అయ్యి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ ఆ సినిమా గురించి మరోసారి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఖైదీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ....
'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ' ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!