అతిలోక సుందరికి అంకితం!
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి భారతీయ చలన చిత్ర పరిశ్రమకి అందించిన సేవల గురించి చెప్పేదేముంది
By: Tupaki Desk | 11 Dec 2023 3:30 PM GMTదివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి భారతీయ చలన చిత్ర పరిశ్రమకి అందించిన సేవల గురించి చెప్పేదేముంది. అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించిన లెజెడరీ నటి. ఇప్పుడామె వారసురాలిగా జాన్వీకపూర్ తెరంగేట్రం చేసి సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా ఆది అర్చీస్ తో లాంచ్ అయింది. ఇక వెండి తెరకు పరిచయం అవ్వడమే ఆలస్యం. వీళ్లిద్దర్నీ వెనుకుండి నడిపిస్తుంది తండ్రి బోనీకపూర్.
తల్లి స్థానం సైతం తాను తీసుకుని కుమార్తెలు ఇద్దర్నీ ఎంతో బాగా చూసుకుంటున్నారు. పెద్దాయన సూచనలు..సలహాలు పాటిస్తూ అక్కా-చెల్లి కెరీర్ లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీదేవి భౌతికంగా లేకపోయిన ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ అభిమానుల్ని..చిత్ర పరిశ్రమల్ని అనునిత్యం వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తొమ్మిదవ ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్స్ ని శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
డిసెంబర్ 16 నుంచి ఎనిమిది రోజుల పాటు ఈవేడుకలు జరగనున్నాయి. ఈసందర్భంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమకు శ్రీదేవి అందించిన సేవల చిరస్మరణీయమని కొనియాడారు. 'నాలుగేళ్ల వయసులో శ్రీదేవి కెరీర్ ప్రారంభించారు. సృజనాత్మకమైన నటనతో శిఖరానికి చేరారు. హందీ..తెలుగు.,.తమిళ..మలయాళ..కన్నడ..ఆంగ్ల భాషల్లో అగ్ర తారగా వెలుగొందారు. ప్రతీ చోట తనదైన ముద్ర వేశారు. ఈ వేడుక ద్వారా ఆమెకి ఘన నివాళి అర్పిస్తామని' నిర్వాహకులు పేర్కొన్నారు.
శ్రీదేవి వివిధ అంతర్జాతీయ వేదికలపైనా మెరిసిన సంగతి తెలిసిందే. నిర్వాహకుల ఆహ్వానం మేరకు దేశ విదేశాల్లో నిర్వహించిన పలు ఫిలిం పెస్టివల్స్ కు శ్రీదేవి వెళ్లారు. అక్కడా తనదైన ముద్ర వేసారు. నటిగా నే కాకుండా నవతరం నాయికలతోనూ పోటీ పడిన సందర్భాలున్నాయి. నటిగా చివరి వరకూ వెండి తెరపై మెరుస్తూనే ఉన్నారు. కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసారు. పలు అవార్డులు..రివార్డులు ఆమె సొంతం.