Begin typing your search above and press return to search.

మాలీవుడ్ వేధింపులు: లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిప‌డేసిన ఖుష్బూ

మలయాళ చిత్ర పరిశ్రమలో `హేమ క‌మిటీ నివేదిక` వేవ్స్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 8:05 AM GMT
మాలీవుడ్ వేధింపులు: లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిప‌డేసిన ఖుష్బూ
X

మలయాళ చిత్ర పరిశ్రమలో `హేమ క‌మిటీ నివేదిక` వేవ్స్ క్రియేట్ చేస్తోంది. చాలామంది న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను బ‌హిర్గ‌తం చేస్తూ మీడియా ఎదుట ఓపెన‌వుతున్నారు. మీటూ ఉద్య‌మం త‌ర్వాత లైంగిక వేధింపుల‌పై ఇది మ‌రో పెద్ద వేవ్ అన్న చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి సమ‌యంలో న‌టి కం రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బూ సుంద‌ర్ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై స్పందిస్తూ ఖుష్బు సుందర్ శక్తివంతమైన ప్రకటనను జారీ చేశారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను బ‌హిరంగంగా చెబుతున్న న‌టీమ‌ణుల‌ను ఈ ప్ర‌క‌ట‌న‌లో ఖుష్బూ మెచ్చుకున్నారు. వారి ధైర్యాన్ని ప్ర‌శంసించారు. లైంగిక‌ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో తమ గొంతుకకు ప్రాముఖ్యతనిస్తూ తమ వంతుగా బాధ్య‌త‌గా నిలబడిన వారిని విజేతలుగా అభివ‌ర్ణించిన ఖుష్బూ వారిపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. కాస్టింగ్ కౌచ్ ఇత‌ర ర‌కాల వేధింపుల గురించి న‌టీమ‌ణులు త‌మ అనుభ‌వాల‌ను వివ‌రిస్తున్న క్ర‌మంలో ఖుష్బూ మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారింది. కెరీర్ పురోగతికి బదులుగా మహిళలు నిరంత‌రం లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్నార‌ని, ఈ రంగంలో పురుషులు అలా ఎందుకు చేస్తున్నారని ఖుష్బు ప్రశ్నించారు. అధికారాన్ని లేదా ప‌వ‌ర్ ని దుర్వినియోగం చేయడం, లైంగిక ప్రయోజనాల కోసం న‌టీమ‌ణుల‌ను రాజీ కోర‌డం... వారి కెరీర్‌ను నాశ‌నం చేయడం ప్రతి రంగంలోనూ ఉంది. స్త్రీ ఒంటరిగా ఎందుకు కష్టాల్లో కూరుకుపోతోంది? అంటూ ఖుష్బూ ప్ర‌శ్నించారు. ముఖ్యంగా వినోద‌రంగంలో న‌టీమ‌ణుల‌ సమస్యలను హైలైట్ చేస్తూ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధించారు ఖుష్బూ. ఇక్కడ మహిళలు నిరంత‌రం దోపిడీకి గురవుతున్నార‌ని అన్నారు.

మహిళలు తమ గౌరవం, ఆత్మ‌ గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడవద్దని ఖుష్బు కోరారు. ఇది అందరికీ మేల్కొలుపు కాల్. దోపిడీ ఇక్కడితో ఆగాలి. స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడండి. గుర్తుంచుకోండి... జీవితంలో మీకు ఎల్లప్పుడూ ఎంపిక ఉంటుంది. నో చెప్పాల్సిన స‌మ‌యంలో నో చెప్పండి.. అని ఖుష్బూ సూచించారు. మీటూ ఉద్య‌మం త‌ర‌హాలోనే ఖుష్బూ పిలుపు మహిళా న‌టీమ‌ణులు తమ అనుభవాలను పంచుకునేందుకు, అణ‌చివేత‌పై భయపడకుండా న్యాయం పొందేలా ప్రోత్సహిస్తుందన‌డంలో సందేహం లేదు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన అనంత‌రం ఇది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది. ఖుష్బు వ్యాఖ్యలు పరిశ్రమలోని మహిళలకు సంఘీభావం. నిజానికి ఆడవారు ఆన్ లొకేష‌న్ కఠినమైన ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారికి న్యాయం జ‌రిగేలా, దోపిడీకి వ్య‌తిరేకంగా నిల‌బ‌డేలా చేయ‌డంలో ఖుష్బూ స్ఫూర్తివంత‌మైన స్పీచ్ నిచ్చారు.