దర్శకుడి కుమార్తె ప్రీవెడ్డింగ్‌లో స్టార్ కిడ్స్ సందడి!
ఇటీవల ఆలియా తన వివాహ సన్నాహాల నుండి షేన్‌తో కొన్ని సన్నిహిత ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
By: Tupaki Desk | 4 Dec 2024 11:30 PM GMTకొన్నేళ్ల పాటు సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి అనే సంస్కృతి హైప్రొఫైల్స్ లో సహజంగా చూస్తున్నదే. డేటింగ్ కల్చర్ దేశంలో విస్త్రతంగా అభివృద్ధి చెందింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కుటుంబం అందుకు భిన్నం కాదు. పెళ్లికి ముందే తన స్నేహితుడిని తండ్రి అనురాగ్‌కి పరిచయం చేసింది ఆలియా కశ్యప్. ఈ జంట ఆ తర్వాత కలిసి జీవించారు. ఎట్టకేలకు ఆలియా కశ్యప్ తన భర్త షేన్ గ్రెగోయిర్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల ఆలియా తన వివాహ సన్నాహాల నుండి షేన్‌తో కొన్ని సన్నిహిత ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఖుషీ కపూర్ ఆలియా-షేన్ జంట ప్రీవెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసింది.
ఖుషీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలో ఆలియా కశ్యప్, షేన్ .. మరికొందరు స్నేహితులతో పోజులిస్తూ కనిపించారు.
షేన్ తెలుపు- ఎరుపు రంగు కుర్తాలో అందంగా కనిపించాడు. వరుడు నికార్సయిన దేశీ బోయ్ లా కనిపించాడు. అలాగే వధువు అద్భుతమైన ఎరుపు రంగు సూట్‌లో అబ్బురపరిచింది. ఫుల్ టైమ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అయిన ఆలియా కశ్యప్, తన ఫాలోయర్స్‌కు జీవితం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటారు. 2020 కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో షేన్‌ని ఎలా కలిసిందో ఒక కథనాన్ని కూడా షేర్ చేసింది.
తన యూట్యూబ్ ఛానెల్‌లోని ఒక వ్లాగ్‌లో షేన్ డేటింగ్ యాప్ ప్రొఫైల్‌పై కుడివైపుకి స్వైప్ చేసిన మొదటి వ్యక్తి తానేనని ఆలియా వెల్లడించింది. ఇది వారి కనెక్షన్‌కు దారితీసింది. అమెరికాలో ఉన్న ఒక వ్యవస్థాపకుడు షేన్, 15 సంవత్సరాల వయస్సు నుండి రాకెట్ పవర్డ్ సౌండ్ అనే తన వ్యాపారాన్ని నడుపుతున్నాడు. 20 మే 2023న షేన్ బాలిలో ఆలియాకు ప్రపోజ్ చేశాడు. వారు నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమె తన అద్భుతమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ .. షేన్‌తో తీపి ముద్దుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆలియా షేన్‌ని తన బెస్ట్ ఫ్రెండ్, భాగస్వామి, సోల్‌మేట్ .. కాబోయే భర్త అని పేర్కొంది. అతడికి అవును అని చెప్పడం తను తీసుకున్న అత్యంత సులభమైన నిర్ణయమని, అతడితో జీవితాంతం గడపడానికి వేచి ఉండలేనని ఆలియా పేర్కొన్నారు.
ఈ జంట నిశ్చితార్థం ముంబైలో విలాసవంతమైన వేడుకగా జరిగింది. ఆలియా ఎంగేజ్‌మెంట్ పార్టీ మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. మేలో ఆలియా తన యూట్యూబ్ ఛానెల్‌లో తన పెళ్లి దుస్తులను ట్రయల్ చేసిందని.. ప్రఖ్యాత డిజైనర్ అనితా డోంగ్రే తన వివాహ దుస్తులను రూపొందించనున్నట్లు వెల్లడించింది. ఫిలింఫేర్ వివరాల ప్రకారం.. ఆలియా - షేన్ డిసెంబర్ 11న గ్రాండ్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేస్తున్నారు. ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్స్‌లోని బాంబే క్లబ్ వేదికగా ఈ పెళ్లి జరగనుంది.